Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలీల్‌పై చర్యలు తీసుకోవాలని టిగ్లా డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో ప్రకారం నూతన లోకల్ క్యాడర్ విభజన ప్రక్రియలో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణగౌడ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియేట్ విద్యా వ్యవస్థలో 317 జీవో ప్రకారం విభజన సందర్భంగా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలనీ, భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. విభజన సమయంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు, స్పెషల్ కేటగిరీల కింద మినహాయింపు ఉన్న ఉద్యోగుల వివరాలు ఎప్పటికప్పుడు ఇచ్చినా కావాలనే అన్యాయం చేశారని విమర్శించారు. ఇప్పటివరకు మంజూరైన పోస్టులెన్ని?, పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత మంది?, కేటాయించిన వారి సంఖ్య, ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు ఎంత శాతం ఉన్నారు వంటి వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు పి మధుసూదన్ రెడ్డి స్వార్ధపు మాటలు నమ్మి అతనిపై అబిడ్స్, సిద్ధిపేట పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిన మహిళా అధికారులను జలీల్ వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు పనులపై సమగ్ర న్యాయ విచారణ జరిపి భాద్యులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.