Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఏరియాల జీఎమ్లకు సింగరేణి సీఎమ్‌డీ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మంచి వృద్ధిని సింగరేణి సంస్థ నమోదు చేసిందని, ఇదే ఒరవడితో 68 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారంనాడాయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, సలహాదార్లు, ఆయా ప్రాంతాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ ఉత్పత్తిని సమీక్షించారు. గత ఏడాదికంటే ఇప్పుడు అదనంగా ఉత్పత్తిలో 42 శాతం, బొగ్గు రవాణాలో 52 శాతం ఓవర్ బర్డెన్ తొలగింపులో 23 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో ఏరియాలవారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఇకపై రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 14.8 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు జరపాలని ఆదేశించారు. ఏప్రిల్ నుంచి ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందనీ, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యాలను చేరుకుంటామని వివరించారు. కొత్త గనుల నుంచి ఉత్పత్తిపై దృష్టి సారించాలనీ, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలను స్థానిక ప్రభుత్వ అధికారుల సహకారం తీసుకుంటూ పరిష్కరించుకోవాలని జీఎంలను ఆదేశించారు. ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు, కంటిన్యూయస్ మైనర్ గనుల పనితీరునూ ఆయన సమీక్షించారు. జీడీకే 11 ఏ గనిలోని రెండు కంటిన్యూయస్ మైనర్లు ఒక్కొక్కటి 25 నుంచి 30 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాలనీ, పీవీకే-5, వకీల్‌పల్లి కంటిన్యూయస్ మైనర్లు కూడా ఇదే స్థాయిలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, (ఫైనాన్స్, పర్సనల్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) ఎన్.బలరామ్, (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, అడ్వైజర్లు (మైనింగ్) డీ.ఎన్.ప్రసాద్, (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ (కోల్ మూమెంట్) జే ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) నాగభూషణ్ రెడ్డి, జీఎం (మార్కెటింగ్) కె.రవిశంకర్, జీఎం (పీపీ) పి.సత్తయ్య, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, జీఎం (అడ్రియాల) ఎన్.వి.కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.