Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల అవసరాల మేరకు బస్సులు పెంచాలి
- పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి:సీఎం కేసీఆర్కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీని సేవారంగంగా గుర్తించి నిధులు విడుదల చేయాలి తప్ప లాభనష్టాల ప్రాతిపదికన చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సీఐటీయూ సూచించింది. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు రాశారు. కార్మికులపై అదనపు భారం మోపడం తగదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు, ఏరియల్స్, బోనస్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఒక శాతం నిధులను కేటాయించాలని కోరారు. బస్సు డిపోలను మూసేయడం తగదని పేర్కొన్నారు. ఆర్టీసీ భూములను లీజు పేరుతో పెద్దలకు కట్టబెట్టడం సరిగాదని హెచ్చరించారు. ఆ ఖాళీ స్థలాలను ఆర్టిసినే వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని సూచించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యక్రమాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే కొత్త వేతన ఒప్పందాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వ ఈక్విటీగా మార్పు చేయాలని కోరారు. 2019 తర్వాత నుంచి సర్వీసులో ఉండి చనిపోయిన వారి సంఖ్య 600కు పైగానే ఉందనీ, బాధిత కుటుంబాలకు తక్షణమే ఈడీఎల్ఐఎస్ కింద చెల్లించాల్సిన రూ.6 లక్షలు, ఎస్బిటి ద్వారా చెల్లించాల్సిన రూ.1.5 లక్షల ఇవ్వాలని కోరారు. 'బ్రెడ్ విన్నర్' స్కీమ్ కింద రావాల్సిన ఉద్యోగం ఎప్పుడు వస్తుందో! అసలు వస్తుందో ? రాదో ? అనే ఆందోళనతో 800 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.