Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్ పార్కు వద్ద కాంగ్రెస్ వినూత్న నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న రూ.171 కోట్ల మద్యం అమ్మినందుకు సీఎం కేసీఆర్‌కు తాగుబోతు (షరాబీ) రత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని డిమాండ్ చేసింది. టీపీసీసీ కార్యదర్శులు బక్క జడ్సన్ ఆధ్వర్యంలో సోమవారం గన్ పార్కు వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. కేసీఆర్ ఫోటోకు బ్రాండీ, బీరు, విస్కీలతో మద్యాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అవినీతిలో, అప్పుల్లో, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్‌గా మారిందని విమర్శించారు. నిరుద్యోగం 33.9 శాతానికి పెరిగితే ఖాళీలు భర్తీ చేయకుండా 317 అక్రమ జీవోను జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 19 మంది మద్యానికి బానిసలుగా మారారనీ, పిల్లలకు రక్షణ లేని రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఉజ్మా షాకేర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.