Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ అడ్వకేట్ జనరల్‌కు బాధ్యతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజలాల వివాదంపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నది. ఇప్పటికే ఆయా అంశాలపై న్యాయపరమైన చిక్కులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా, కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఆశించిన సహకారం లేదు. దీంతో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో కృష్ణాజలాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి సమస్యను కొలిక్కితెచ్చేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ప్రత్యేకంగా నియమించింది. ఆయన కసరత్తు ఇప్పటికే ప్రారంభించారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులను ఏర్పాటు చేసింది. కానీ, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేందుకు ససేమిరా అంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. విభజన చట్టం ప్రకారం అంతరాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాలంటే ట్రిబ్యునల్ తప్పనిసరి. కాగా గత వారం కేఆర్ఎంబీ బోర్డు సమావేశమై నోటిఫికేషన్లో జారీ చేసిన అంశాలపై సమీక్ష చేసింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయడం, అనుమతిలేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించడం, సీఐఎస్ఎఫ్ భద్రత తదితర అంశాలపై చర్చించింది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను తిరస్కరించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో కృష్ణాజలాల వివాదాన్ని త్వరగా ముగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి అడ్వకేట్ జనరల్‌గా నియమతులైన కె.రామకృష్ణారెడ్డికి బాధ్యతలను అప్పగించింది. సుప్రీంకోర్టు కేసులోని కేసులు, కేఆర్ఎంబీ, నోటిఫికేషన్ తదితర అంశాలపై ఆయన ఇప్పటికే అధ్యయనం ప్రారంభించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుతోపాటు బ్రీజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు సంబంధించి వ్యవహారాలను అధ్యయనం చేయడం చేస్తున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ మాజీ అడ్వకేట్ జనరల్‌ను గత వారం పిలిచి బాధ్యతలు అప్పగించినట్టు సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ అధికా రుల సమాచారం. రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో కసరత్తును చేపట్టారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో న్యాయపరమైన అంశాలను చర్చించి, కృష్ణాజలాల వివాదం పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేథ్యంలో రామకృష్ణారెడ్డి జలసౌధలోని సీనియర్ అధికారులతో ప్రతిరోజూ భేటి అవుతూ కసరత్తు చేస్తున్నారు.