Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికత ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలి: టీఈఏ అధ్యక్షులు సంపత్కుమారస్వామి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను రద్దు చేయాల్సిందేనని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్కుమారస్వామి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 317 జీవోలో స్థానికత అంశం ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపులు చేపట్టాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలనీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలనీ, స్థానికతకు ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి వేరే జిల్లా, జోన్, మల్టీజోన్కు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మనోభావాలను తెలుసుకోని కొన్ని సంఘాల వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. స్థానికత కోల్పోయి వేరే జిల్లా, జోన్, మల్టీజోన్కు కేటాయించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం 317 జీవోను వెనక్కి తీసుకోకపోతే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలనూ కలుపుకుని మరో ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం మాట్లాడుతూ ఈ జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు నిరుద్యోగులనూ అన్యాయం జరుగుతుందని చెప్పారు. బాధితులు దరఖాస్తు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని 317 జీవోలో స్థానికతను చేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలోనే కేటాయిస్తున్నామంటున్న అధికారులు భవిష్యత్తులో వారి స్థానికత ఉన్న సొంత జిల్లాకు వచ్చే అవకాశముందా? అని ప్రశ్నించారు. ఎనిమిది గుర్తింపు సంఘాలు లిఖితపూర్వకంగా సంతకం చేసిన తర్వాతే జీవో నెంబర్ 317ను విడుదల చేశామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం వాస్తవమేనా?, దీనిపై టీఎన్జీవో అధ్యక్షులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా త్వరలో అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పాఠశాల విద్యాశాఖ విభాగం అధ్యక్షులు సంతోష్ కీర్తి మాట్లాడుతూ ఉద్యోగుల విభజన ఎలా జరుగుతున్నదో అధికారులకే అర్థం కావడం లేదన్నారు. స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులు వందల మంది పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్దకు వస్తున్నారని వివరించారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.