Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసైన్డ్, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు హక్కు పత్రాలున్నవారందరికీ రైతు బంధు వర్తింపజేయాలనీ, అసైన్డ్, పోడు భూములకు ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లోని ఉపాధి హామీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం ఆన్లైన్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగింది. వెంకట్రాములు మాట్లాడుతూ.. పోడు సదస్సులో గుర్తించిన వారికి ఒక్కరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. ధరణి పోర్టల్‌లో మార్పులు తేకపోవటం వలన గతంలో పట్టాలున్న అనేకమంది అసైన్డ్‌మెంట్ దారులు పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేదని తెలిపారు. సాగులో లేని రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు, ఫామ్ హౌస్ వ్యవసాయ భూములకు రైతు బంధు ఎందుకు అని ప్రశ్నించారు. అలా ఇవ్వడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. పంటలు పండించే కౌలు రైతులను గుర్తించడానికి సిద్ధపడని ప్రభుత్వం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి, వ్యవసాయం చేయని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు రైతు బంధు డబ్బులివ్వడం ఆందోళనకరమని వాపో యారు. మిర్చి పంటకు తెగుళ్లు సోకి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయనీ, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పొలాల్లో పని చేసే వ్యవసాయ కూలీల ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు. రైతులు, కూలీలను ఆదుకోవడం కోసం రాష్ట్ర మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని, పని దినాల నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జి నాగయ్య, పొన్నం వెంకటేశ్వర రావు, నారి అయిలయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, కొండమడుగు నరసింహ, ఆలవాల వీరన్న, ఎదునూరి వెంకట్రాజం, శశిథర్ , రామ చంద్రం, గోపాల్, సైదులు, ఆర్ ఆంజనేయులు పాల్గొన్నారు.