Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం పేర బీజేపీ రాజకీయాలు
- కేంద్రంతో టీఆర్ఎస్ది లాలూచీ కుస్తీ: సీపీఐ(ఎం) నిజామాబాద్ 22వ జిల్లా మహాసభలో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
- పోలీసుల కరోనా ఆంక్షలతో సభ రద్దు.. ఆన్లైన్లో ఏర్పాటు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైషమ్యాలు సృష్టిస్తూ పబ్బం గడిపే ఎత్తులకు తెరలేపిందనీ, ప్రజా ఉద్యమాలతోనే ఆ ఎత్తులను చిత్తు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా 22వ మహాసభలు సోమవారం బోధన్ పట్టణంలోని జోగు చిన్నసాయిలు నగర్(మర్హబాపంక్షన్ హాల్)లో ప్రారంభమయ్యాయి. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో మహాసభ ప్రారంభసూచికగా పట్టణంలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, ప్రారంభ సభను రద్దు చేశారు. అయితే ప్రతినిధుల సభ ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. ఈ మహాసభకు వీరయ్య హాజరై ప్రారంభోపన్యాసం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్లో చేసిన తాత్సారం వల్ల ఒమిక్రాన్ ముప్పు దేశానికి పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలనలో సోషలిస్టు దేశాలు ముందు వరుసలో ఉంటే.. పెట్టుబడిదారీ దేశాలు ఆకలి మంటలు, అసమానతలు, నిరుద్యోగంలో మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనూ మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ విభజన చేస్తున్నారని అన్నారు. నిత్యవసర ధరలు పెరగడంతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ లేదని తెలిపారు. కార్మిక చట్టాల రద్దు చేశారనీ, రైతు వ్యవస్థను ధ్వంసం చేసి శ్రమను బడా కార్పొరేట్లు దోచుకునేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. లైంగికదాడులు, కులదురంహకార దాడులు పెరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అధికార యావ తప్పా.. ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఇక ప్రాంతీయ పార్టీల న్నీ పచ్చి అవకాశవాద ధోరణి ప్రదర్శిస్తున్నాయని అన్నారు. ఈ సమయంలో ప్రజా ఉద్యమాలతోనే పాలక ప్రభుత్వాల నిరంకుశ విధానాలను తిప్పికొట్టొచ్చని ఢిల్లీలో ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం నిరూపితం చేసిందన్నారు. బీజేపీ సర్కారు మెడలు వంచి రైతు చట్టాలను వెనక్కి తీసుకునేలా ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. ఈ ఉద్యమ ఫలితంగానే వివాదాస్పద ఎన్ఆర్సీ సైతం తాత్కాలికంగా వెనక్కి పోయిందని వివరించారు. అయితే ప్రజా ఉద్యమాలు నిర్మించాలంటే ప్రజలతో మమేకం కావాలనీ, అన్నారు. కమ్యూనిస్టులుగా ఎర్రజెండాను గ్రామగ్రామన తీసుకెళ్లి ప్రజా ఉద్యమాలను విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని స్పష్టం చేశారు. ఆ తరువాత జిల్లా మహాసభల్లో కార్యదర్శి నివేదికను జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ప్రవేశపెట్టారు. అంతకముందు మహాసభల సూచికగా పార్టీ జెండాను బోధన్‌కు చెందిన సీనియర్ నేత బాలయ్య ఆవిష్కరించారు. మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్, ఎస్.రమ, జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, నుర్జహాన్, సబ్బని లత, గోవర్ధన్, రామ్మోహన్, పెద్దిసూరి, తదితరులు పాల్గొన్నారు.