Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్
- ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల లాఠీచార్జి, స్టేషన్‌కు తరలింపు
- పరిస్థితి ఉద్రిక్తం.. విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-ఆదిలాబాద్ కలెక్టరేట్
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ సాధన సమితి చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు సోమవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరాయి. ర్యాలీ కుమురంభీం చౌరస్తా వరకు చేరుకోగానే.. ఆ సమయంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ వాహనం రాగా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డగించారు. వాహనాన్ని ముందుకు కదలనీయకుండా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు నాయకులను పక్కకు తప్పించి కలెక్టర్ వాహనాన్ని పంపించే ప్రయత్నం చేయగా, విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు 15నిమిషాలపాటు కలెక్టర్ వాహనంలోనే ఉండిపోయారు. పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఎస్పీ ఉదరుకుమార్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకొని పరిస్థితి అదుపు చేయాలని సూచించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. విద్యార్థులను చెదరగొట్టడంతో కుమురంభీం చౌక్ ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ వాహనాన్ని వేరే మార్గం గుండా పంపించారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం విద్యార్థులు కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ భోజన్న విద్యార్థులను శాంతింపజేయటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అనంతరం రెండో పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టారు. చివరకు తుడుందెబ్బ నాయకులు విద్యార్థులకు నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.