Authorization
Sat April 12, 2025 04:28:25 pm
- కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దీక్షకు దిగారని అరెస్ట్
- కరీంనగర్ జైలుకు తరలింపు
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి జనజాగరణ దీక్ష చేశారంటూ.. పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను రద్దు చేయాలని ఆదివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేస్తుండగా గ్రిల్ గేట్‌ను గ్యాస్ కట్టర్‌తో తొలగించి అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి రాత్రి భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. మానకొండూర్ పోలీస్ స్టేషన్ నుంచి కరీంనగర్ పోలీసు కమిషనరేట్ శిక్షణా కేంద్రానికి సోమవారం ఉదయం బండి సంజరును తరలించగా.. అక్కడా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగగా.. అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కార్యకర్తల తోపులాటలు, పోలీసులు లాఠీచార్జి.. అరెస్టుల పర్వం కొనసాగింది.
డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు..
భారీ బందోబస్తు మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసు శిక్షణాకేంద్రం నుంచి కరీంనగర్ కోర్టుకు తరలించారు. వాదోపవా దాల అనంతరం ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బండి సంజరుపై 188, 332, 333, 149, 147, 188 సెక్షన్లతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51 /బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీపీ సత్యనారాయణ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసుల విధులను ఆటంకపర్చారని సీపీ తెలిపారు. ఇప్పటి వరకు 70 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశామని, రెండు వేరు వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. రిమాండ్ అనంతరం బండి సహా మిగతా నాయకులను కరీంనగర్ జైలుకు తరలించారు.