Authorization
Sun April 13, 2025 05:09:41 am
- గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: మంత్రి సత్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ , కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారిని వైద్యులకు చూపించి, తగిన పరీక్షలు చేయించాలని చెప్పారు. ఈ నెల ఎనిమిది నుంచి 16 వరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది బాధ్యత తీసుకుని ప్రతి విద్యార్థి టీకా వేయించుకునేలా చూడాలన్నారు. రోజువారి లక్ష్యాలు పెట్టుకుని విద్యార్థులకు ఈ టీకాలు వేయించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, తద్వారా విద్యార్థులు ఒమిక్రాన్, కోవిడ్ బారిన పడకుండా పరిరక్షించాలని కోరారు. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రి ఆయనకు వీడ్కోలు పలికి, శాలువాతో సన్మానించారు.