Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- నందిగామ సవారియా పైపుల పరిశ్రమలో ఘటన
నవతెలంగాణ- పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ సవారియా పైపుల పరిశ్రమలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్‌పై ఇనుపరాడ్లను తరలిస్తుండగా.. క్రేన్ వైర్లు తెగి రాడ్లు మీదపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనను బయటికి పొక్కకుండా సదరు పరిశ్రమ యాజమాన్యం జాగ్రత్తపడటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ (30), ఫాజ్దార్ (28), జితేంద్రకుమార్, ఆనంద్‌కుమార్ నందిగామ సవారియా పైపుల పరిశ్రమలో పనిచేస్తున్నారు. అయితే విధుల్లో భాగంగా సోమవారం రాత్రి క్రేన్ సాయంతో ఇనుపరాడ్లు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో క్రేన్ వైర్లు తెగడంతో ఇనుపరాడ్లు వారిమీద పడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రేమ్‌కుమార్, ఫాజ్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. జితేంద్రకుమార్, ఆనంద్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమ యాజమాన్యం ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది. మంగళవారం విషయం బయటికి రావడంతో.. ఈ మేరకు బీడీఎల్ సీఐ రామ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద ఘటనను దాచిపెట్టిన యాజమాన్యంపై వివిధ కార్మిక సంఘాలు మండిపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికీ మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.