Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఇబ్బందుల్లో ప్రజలు
- 'రెవెన్యూ'లోనే వీఆర్వోలను కొనసాగించాలి : వీఆర్వోల సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూపరిపాలన శాఖను బలోపేతం చేయాలనీ, వీఆర్వోలను ఆ శాఖలోనే కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి హరాలే సుధాకర్‌రావు, కోశాధికారి కోనబోయిన ప్రసాద్, ఉపాధ్యక్షులు మోహన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూలో సంస్కరణలు, ధరణి వల్ల ఎలక్ట్రానిక్ పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి తప్ప భూ సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదని తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీఓల అధికారాల కుదింపు వల్ల కలెక్టర్లపై పనిభారం పెరిగిందనీ, దీంతో ప్రజలకు రెవెన్యూ పాలన దూరమై భారంగా మారిందని వివరించారు. వీఆర్వోలు ప్రభుత్వానికిగానీ, ప్రజలకు గానీ ద్రోహం చేయలేదని పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్ధ రద్దు వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయటం ప్రజా పాలనకు తీవ్ర విఘాతమని హెచ్చరించారు. రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ లేకపోవడం వల్ల ఆ శాఖపై ప్రభుత్వం పట్టుకోల్పోయిందని విమర్శించారు. లక్షలాది మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, సీఎస్ ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ శాఖలోని సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించాలని కోరారు. సమగ్ర భూ సర్వేద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అన్ని రాష్ట్రాలల్లో లాగే గ్రామ స్థాయిలో రెవిన్యూ ఉద్యోగిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలను సొంత జిల్లాలకు బదిలీ చేసి పదోన్నతులు కల్పించాలనీ, అకాల మరణం పొందిన వీఆర్వోల స్థానంలో వారి కుటుంబ సభ్యులను కారుణ్య నియామకాల ద్వారా నియమించాలని కోరారు. ఆర్డీఓ, తహసీల్దార్ల అధికారాలను పునరుద్ధరించాలని విన్నవించారు. సీసీఎల్ అధికారితో పాటు అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని కోరారు. వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.