Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్స్ సాయుధ పోలీసుల దాతృత్వం ఎనలేదనిదని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో వారందించిన సేవలు ఎవరూ మరవరని చెప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన యూసఫ్గూఢలోని స్పెషల్ పోలీసు బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. డీజీపీ ఈ సందర్భంగా బెటాలియన్స్ కమాండెంట్స్, అదనపు కమాండెంట్స్, డిప్యూటీ కమాండెంట్స్తో పాటు పలువురు కిందిస్థాయి అధికారులను కలిసి నూతన సంవత్సర శూభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు నేరస్థులను పట్టుకోవడంలో బెటాలియన్ పోలీసులు.. సివిల్ పోలీసులకు ఎంతగానో సహాయ, సహకారాలను అందజేస్తున్నారని తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేని సమయంలోనూ, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఏరియాల్లోనూ వారు విధి నిర్వహణను సాగిస్తున్నారని అన్నారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంతో పాటు అవసరమనుకున్నప్పుడల్లా బాధితులకు ప్లాస్మాతో పాటు రక్త దానాన్ని చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడరని డీజీపీ మెచ్చుకున్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన సేవా పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీపీ అభిలాష బిస్త్‌తో పాటు రాష్ట్ర శాంతి, భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ తదితర ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.