Authorization
Sat April 12, 2025 09:49:46 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను రద్దు చేసి ఉద్యోగుల కేటాయింపులను నిలిపేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులను నూతన జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు విడుదల చేసిన 317 జీవో ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులు వారి సొంత జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సూచనలు, సలహాలు తీసుకుని కేటాయింపులు చేపట్టాలని కోరారు. కానీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఈనెల ఏడో తేదీలోపు కేటాయింపులు చేస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని విమర్శించారు.