Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 10న పోస్టుకార్డుల ఉద్యమం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఈ నెల పదో తేదీన సీఎం కేసీఆర్‌కు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్‌రావుకు ప్రతి వీఓఏ పది పోస్టు కార్డులను రాయాలని పిలుపునిచ్చింది. బీమా సౌకర్యం కల్పించాలనీ, శ్రీనిధి ఇన్సెంటీవ్ ఇవ్వాలనీ, ఆన్లైన్ పనిభారం తగ్గించాలని కోరింది. మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఓఏ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్ మాట్లాడుతూ..వేలకోట్ల రూపాయలు పొదుపును సేకరించడంలో, సంఘాలను నిర్వహించడంలో ఐకేపీవీఓఏ పాత్ర కీలకమైందని చెప్పారు. పని గంటలు, జాబ్‌చార్ట్, కనీస హక్కులకు నోచుకోకుండా 20 ఏండ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వీఓఏల న్యాయ డిమాండ్లను పరిష్కరించకపోతే ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగేష్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సుమలత, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు వెంకటయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమతి, చంద్రశేఖర్, సతీష్, ఆంజనేయులు, కిష్టయ్య, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.