Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి
- రాఘవ అకృత్యాలపై గవర్నర్, సీఎం, డీజీపీకి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం పాత పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలనీ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం ఈ సంఘటనలో చావుబతుకుల్లో ఉన్న రామకృష్ణ కూతురిని కొత్తగూడెం ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం పాతపాల్వంచలోని స్వగృహాన్ని జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నాగ రామకృష్ణ ఆత్మహుతి సంఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా తనయుడు అకృత్యాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, గవర్నర్, రాష్ట్ర డీజీపీలకు ఫిర్యాదు చేయనున్నట్టు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు రక్షణ లేదంటూ, వారు భయం గుప్పిట్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కుటంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందంటే అరాచకాలు ఎలా ఉన్నాయో అర్ధమవుతుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తనయుడి వల్ల రామకృష్ణ కుటుంబం ఎంతో మనోవేదన చెంది తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తనతో పాటు భార్య పిల్లలపైనా పెట్రోలు పోసి తగలబడి ఆత్మహుతి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన ఎమ్మెల్యే తనయుడిని కాల్చివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవిప్రసన్న, పట్టణాధ్యక్షులు నూకల రంగారావు, చాంద్‌పాషా, కాపా శ్రీనివాస్, మురళి, రాములు నాయక్, ఇస్లావత్ రాజు, వెంకట్భాను పాల్గొన్నారు.