Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెంట్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -మిర్యాలగూడ
సాగర్ నీటి విడుదల ఈ నెల 15 వరకు పొడిగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి పంట నీటి విడుదల మొదటి విడత ఈ నెల 7తో ముగుస్తుందనీ, ఆయకట్టులో కేవలం 40 శాతం మాత్రమే పంటలు సాగు చేశారనీ, ఇంకా 60 శాతం నాట్లు జరగాల్సి ఉందన్నారు. సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నందున.. ఈ నెల 15 వరకు నీరు విడుదల కొనసాగించాలని కోరారు. కేంద్రం అమలు చేసే కరెంట్ బిల్లుల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కరెంటు వినియోగం పెరిగిందనీ, దానికనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ప్రయివేటు సంస్థ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందనీ, అందుకే చార్జీలు పెంచుతున్నట్టు ప్రభుత్వాలు కుంటిసాకులు చెబుతున్నాయన్నారు. నష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనీ, లేదా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకానీ చార్జీలు పెంచడం సరికాదన్నారు. చార్జీలు పెంచితే మరో బషీర్బాగ్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డాక్టర్ గౌతమ్ రెడ్డి, బావండ్ల పాండు రంగారెడ్డి, మంగా రెడ్డి, తిరుపతి రామ్మూర్తి పాల్గొన్నారు.