Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు టియుఎంహెచ్ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆస్పత్రుల్లో కాంట్రాక్టు వర్కర్ల వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో భూపాల్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. వైద్యవిద్య, వైద్య విధాన పరిషత్ పరిధిలోని జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు చాలా ఏండ్లుగా పని చేస్తున్నా.... కనీస వేతనాలు అమలు కావడం లేదని తెలిపారు. పెరిగిన ధరలతో గత ఏడేండ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు, కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేశామనీ, వారు హామీ ఇచ్చినా అమలు కాలేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ముప్పు ఉన్నప్పటికీ సేవలందించినా కనీసం ఇన్సెంటివ్‌కు కూడా నోచు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీల టెండర్ కాలం ముగిసినా పొడిగిస్తూ, వర్కర్లకు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు.
కార్మికశాఖ జీవో నెంబర్ 68, ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జీవో నెంబర్ 60ని అమలు చేయాలని కోరారు. పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్‌లలో కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని కోరారు. కార్మిక, యజమాని వాటాలు సక్రమంగా జమ చేసేలా, కార్మికశాఖ నిర్ణయించిన సెలవులతో పాటు ఏడాదికి 24 సీఎల్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి మ్యాన్ పవర్ నిర్వహణ ఆస్పత్రుల్లో అధికారులకు అప్పగించాలనీ, సిబ్బందికి సరిపడా మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్ల కొరత లేకుండా అందించాలనీ, కరోనా ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు.