Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 1,052 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒమిక్రాన్ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం వరసగా రెండో రోజూ కేసులు రెట్టింపయ్యాయి. ఆదివారం 274 కేసులు రాగా మరుసటి రోజు 482కు చేరుకున్నాయి. తాజాగా వాటి సంఖ్య 1,052కు చేరుకుంది. పాజిటివ్ రేటు 2.44కు చేరింది. ఇద్దరు మరణించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య 4,858కి చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నది. మంగళవారం జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల్లో 10 మందికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు బయటపడింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరిలోనే ఈ పెరుగుదల కనిపించగా, ప్రస్తుతం కరీంనగర్, మహబూబాబాద్, నల్లగొండ, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండ జిల్లాల్లోనూ కేసులు రెండంకెల్లోకి చేరాయి.
కొత్త కేసుల కన్నా నాలుగో వంతు అంటే 240 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకోవడం థర్డ్‌వేవ్‌కు సంకేతంగా కనిపిస్తున్నది. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 42,991 మందికి టెస్టులు చేశారు. 5,481 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి. విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 50 మంది ఒమిక్రాన్ పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉన్నవి. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులొచ్చాయి.
23 జిల్లాల్లో పెరిగిన కోవిడ్
జీహెచ్ఎంసీతో పాటు 23 జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో తగ్గాయి. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ములుగు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదు.