Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంధులు, పాక్షిక దృష్టి లోపం కలిగినవారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు తప్పవని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లూయిస్ బ్రెయిలీ 213వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లో అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని ఆర్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెయిలీ చిత్రపటానికి వారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. బ్రెయిలీ లిపి ఆరు చుక్కలను ఉపయోగించి అక్షరాలు, అంకెలను స్పర్శ ద్వారా తెలుసుకోవటానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో బ్రెయిలీ లిపి అందుబాటులో ఉండటం ద్వారా అనేకమంది అంధులు ఉన్నత విద్యావంతులవుతున్నారని తెలిపారు. దృష్టి లోపం ఉన్న వారు సమాజంలో అన్ని రంగాల్లో నిలదొక్కుకునేందుకు అందరికీ సమాన అవకాశాలు పొందేందుకు, విద్య ,ఉపాధి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, బ్రెయిలీ లిపి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి సమాజంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిందనీ, అంధుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని పేర్కొన్నారు. శాస్త్ర,సాంకేతిక సమాచారాన్ని అందుబాటులో లేకుండా చేసిందనీ, ఈ క్రమంలో అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అంధులు వినియోగించుకునే విధంగా సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చడంలో, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రవి, పట్నం సిటీ కార్యదర్శి మారన్న, ఎన్పీఆర్డీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు యూసుఫ్, వరప్రసాద్, రాజు, నర్సింగ్, శివశంకర్, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.