Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసంపూర్తిగా సాంగిడి పథకం
- పనులను మధ్యలోనే వదిలేసిన గుత్తేదారు
- రూ.5.40కోట్ల ప్రజా ధనం వృథా
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వృథాగా పోతున్న నది నీటిని ఒడిసి పట్టుకుని భూములకు పారించాలని నాలుగేండ్ల కిందట చేపట్టిన ఎత్తిపోతల పథకం.. ఇంతవరకు నీటిని ఎత్తిపోయలేదు.. భూములను తడపలేదు. అసంపూర్తిగానే ప్రాజెక్టు ఆగిపో యింది. గుత్తేదారు పనులను నాసిరకంగా చేసి వదిలేసినట్టు ఆరోపణలు న్నాయి. చేసిన పనులూ నాసిరకంగా ఉండటంతో.. పగుళ్లు తేలాయని రైతులు తెలిపారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా సాంగిడి గ్రామానికి ఆనుకొని పెన్‌గంగ నది ప్రవహిస్తోంది. వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి పంటలకు సాగు నీరందించాలని ప్రభుత్వం భావించింది. గ్రామ శివారులో నది ఒడ్డున ఎత్తిపోతల పథకం నిర్మించాలని నిర్ణయించింది. సుమారు 400 ఎకరాలకు సాగు నీరందించేందుకు నాలుగేండ్ల కిందట రూ.5.40కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ నీటి పారుదల సంస్థ పర్యవేక్షణలో పనులు ప్రారంభించాలని సంక ల్పించింది. నది నుంచి ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి పైన్లైన్ ద్వారా గ్రామం పొలిమేర వరకు.. అక్కడి నుంచి కాలు వల ద్వారా పంటలకు పారించాలని ప్రణాళిక. కానీ అనుకున్న నిధులు మంజూరైనా.. పనులను దక్కించుకున్న గుత్తేదారు ట్యాంకు నిర్మాణం చేపట్టి అక్కడక్కడ ఒకటి, రెండు పైపులు వేసి మమ అనిపించారు. నిరంతరం పనులను పర్యవేక్షించాల్సిన అధి కారులు అటువైపు దృష్టిసారించలేదు. పొలాల మధ్య నాసిరకంగా ట్యాంకుల నిర్మాణం చేపట్టడంతో ప్రారంభానికంటే ముందే పగుళ్లు తేలాయి.
రైతుల ఆశలపై నీళ్లు..
గ్రామంలో ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుందని తెలియ గానే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇన్నాండ్లు నీరు లేక ఎండిపోతున్న భూములను పారించుకోవచ్చనుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలివేయడంతో నిరాశలో కూరుకుపోయారు. పథ కం ప్రారంభంలో ఒక రోజు నీరు విడుదల చేయడంతో పైప్‌లు పగిలిపోయాయి. లీకేజీలు ఏర్పడటంతో నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. మూడేండ్ల కిందట ఈ పనుల అసంపూర్తిపై గ్రామస్తులు అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పర్యవేక్షించిన అధికారులు పనులు చివరి దశలో ఉన్నాయని, రబీ సీజన్లో సాగు నీరందిస్తామని హామీనిచ్చి నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కానీ నేటికి ఈ పనులు గాడిలో పడటం లేదని.. సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్ అధికారి డీఈ మురళీకృష్ణను 'నవతెలంగాణ' సంప్రదించగా, ''ఎత్తిపోతల కింద మట్టి పూడుకుపోయింది.. ఆ మట్టిని తొలగించడానికి నిధులు కావాలి. నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం'' అని తెలిపారు.
ఎకరానికి కూడా నీరందడం లేదు : గోపతివార్ చంద్రకాంత్- గ్రామస్తుడు
సాంగిడి గ్రామంలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యా యని అధికారులు చెబుతున్నారు. కానీ ఎకరానికి కూడా సాగునీరందడం లేదు. ఈ పథకం కోసం కేటాయించిన నిధులు వృథా అయ్యాయి. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే నీరందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పంటలకు సాగునీరు ఇవ్వడం లేదు.
అసంపూర్తిగా వదిలేశారు : నితిన్, సాంగిడి
ఎత్తిపోతల పథకాన్ని అసంపూర్తిగానే వదిలేశారు. పనులు పూర్తయ్యాయని చెప్పగానే చాలా సంబరపడ్డాం. కానీ నాలుగేండ్లయినా నీటిని విడుదల చేయక పోవడంతో గ్రామస్తులంతా నిరాశకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకొని పనులు పూర్తి చేయించి పంటలకు సాగు నీరందించాలి.