Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషేధిత జాబితాలో పట్టా భూముల్ని చేర్చడం దుర్మార్గం
- నిర్ధిష్ట పోరాటం చేస్తేనే సర్కారు దిగొస్తుంది
- 'ధరణి పోర్టల్‌లో ప్రధాన సమస్యలు-పరిష్కరాలు' అంశంపై రౌండ్‌టేబుల్‌లో రావుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏదైనా కొత్త విధానం తీసుకొస్తే పారదర్శకంగా, అందరికీ ఉపయోగకరంగా ఉండాలిగానీ ధరణి పోర్టల్లాగా అస్తవ్యస్తంగా ఉండొద్దని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక-ధరణి భూ సమస్యల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 'ధరణి పోర్టల్‌లో ప్రధాన సమస్యలు-పరిష్కారాలు' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌కు బ్యాక్అప్ లేదనీ, అది ఒక్కోసారి నిలిచిపోయి రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల భూ యజమానులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన రెవెన్యూ శాఖకు సీసీఎల్ఏ, ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడం దారుణమన్నారు. ధరణి పోర్టల్ సమస్యలపై నిర్ధిష్ట పోరాటం చేస్తేనే సర్కారు దిగివస్తుందని చెప్పారు. సీపీఐ(ఎంల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.సంధ్య మాట్లాడుతూ..ధరణి పోర్టల్ తప్పుల తడక అనీ, సర్కారు నిర్ణయాలతో పట్టా భూ ములున్నవారు కూడా అభద్రతాభావంలో పడ్డారని తెలిపారు. అనుభవదారులు, సాగుదారుల కాలాన్ని తీసేయడాన్ని తప్పుబట్టారు. విదేశాల్లో ఉండేవారికి, వందల ఎకరాలున్నవారికీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు. పదెకరాలలోపు ఉన్న వారికే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న కౌలుదారులకు న్యాయం చేయాలని కోరారు. ఆమ్ఆద్మీపార్టీ నేత ఇందిరాశోభన్ మాట్లాడుతూ..దొరలు, పటేళ్లు తమ వద్ద అక్రమంగా ఉన్న భూములను సక్రమంగా చేసుకునే యత్నంలో భాగంగానే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ..అసైన్డ్, పోడు భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కన్నెగంటి రవి మాట్లాడుతూ..ప్రతిఊరిలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు 30 నుంచి 40 మంది ఉన్నారని తెలిపారు. కౌలు రైతుల సమస్యపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోరిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాంగోపాల్‌రావు, బీజేపీ నేత గురువారెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వేణుగోపాల్‌రెడ్డి, సాదిక్, ధరణి భూ సమస్యల వేదిక నేత మన్నె నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రౌండ్‌టేబుల్ తీర్మానాలు
- రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో తప్పులను సవరించాలి
- పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చిన భూములను సరిచేయాలి.
- మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులుకు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలి.
- అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటును హక్కుదారులకు కల్పించాలి.
- పార్ట్-బీలో చేర్చిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలి.
- సేత్వార్ రికార్డుల్లో, కాస్రపహానిలో తేడాల వల్ల, ఆర్ఎస్ఆర్ సమస్య వల్ల కొద్ది మంది రైతులకు భూమి తగ్గిపోయిందనీ, వాటికి పరిష్కార మార్గాలు చూపాలి.
- వాస్తవ సాగుదారుల కాలం పెట్టి కౌలు రైతులకు న్యాయం చేయాలి.