Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచదేశాలపై కరోనా విశ్వరూపం చూపుతుంటే.. ఇండ్లలో నుంచి బయటకు రావడానికే జనం భయపడుతుంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ కావాల్సి వచ్చిందా?అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడాలని అనుకుంటున్నారా? అని ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మెన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల మూడోతేదీ నుంచి ఎగ్జిబిషన్ల మూసివేత అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఊరికే ఉత్తర్వులు ఇస్తుందా? ప్రభుత్వానికి తెలియదా? ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలో? లేదో? కోర్టుల కంటే ప్రభుత్వానికే బాగా లెలుసుకదా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. 2019లో ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం జరగడంపై లాయర్ ఖాజా ఐజాజుద్దీన్ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సొసైటీ న్యాయవాది కల్పించుకుని ఈ నెల 3 నుంచి ఎగ్జిబిషన్‌ను మూసేయాలని రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేలా రిట్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎగ్జిబిషన్ తెరవాలో? లేదో? ప్రభుత్వమే తేల్చుతుందని స్పష్టం చేసింది. ఎగ్జిబిషన్ పెట్టాలంటే జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖల నుంచి ముందస్తు అనుమతి పొందాలన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందనీ, ఈ నేపథ్యంలో న్యాయవాది వేసిన పిల్‌పై విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. కరోనాపై దాఖలైన వేర్వేరు పిల్స్‌ను కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వ్యాప్తిలో ఉందనీ, దీనిపై ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిపుణుల కమిటీని కూడా గతంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఏజీ బిఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆ కమిటీ చేసిన సిఫార్సులు, వాటి అమలు గురించి వివరిస్తూ ఈ నెల 7న జరిగే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. కోర్టులు, విద్యాసంస్థలను ఆన్లైన్లో పనిచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల లాయర్లు కోరారు. గత నెల 20 నుంచి ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుని ఉంటే ఒమిక్రాన్ తీవ్రరూపం దాల్చకుండా ఉండేదన్నారు. తిరిగి ఏజీ వాదిస్తూ, తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం అయ్యిందనీ, రెండో డోసు 69 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.97 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 6.82 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయనీ, ఇది 2.29 శాతమని, మరణాలు 0.5 శాతమని చెప్పారు. విచారణ ఈనెల ఈ నెల ఏడో తేదీకి వాయిదా పడింది.
నేటి నుంచి ఆన్లైన్లో కేసుల విచారణ
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా న్యాయవాదులు, కక్షిదారుల ఆరోగ్యం దృష్ట్యా బుధవారం నుంచి హైకోర్టు ఆన్లైన్లో కేసుల్ని విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ప్రకటించారు. కేసులను భౌతికంగా విచారణ చేయాలా? లేదా? అని నిర్ణయించే స్వేచ్ఛ, విచక్షణాధికారం న్యాయమూర్తులకు ఉంటుందని చెప్పారు. భౌతిక విచారణలో కోవిడ్ గైడ్‌లైన్స్ అమలు చేసితీరాలని స్పష్టం చేశారు.
బండి సంజరు రిమాండ్‌పై నేడు విచారణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్ కోర్టు రిమాండ్‌కు తరలిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ కేసు హైకోర్టులో విచారణకు రానున్నది. లంచ్ మోషన్ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. కరీంనగర్లో తనపై పోలీసులు మూడో తేదీన నమోదు చేసిన కేసును కొట్టివేయాలనీ, జైలు నుంచి విడుదలయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బండి తరఫు లాయర్ కోరారు.