Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
- త్వరలోనే ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న శాసన మండలి చైర్మెన్ పదవికి ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు షురూ చేశారు. ప్రొటెం చైర్మెన్ వెన్నెం భూపాల్‌రెడ్డి పదవీకాలం మంగళవారం ముగియటంతో సీఎం ఈ అంశంపై దృష్టి సారించారు. ఇప్పుడు శాసనమండలి ఫుల్ కోరంతో ఉంది. ఇటీవలే 19 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయిన సంగతి తెలిసిందే. అయితే మండలి చైర్మెన్, డిప్యూటీ చైర్మెన్ పదవులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డికి మరోసారి అవకాశం దక్కకపోవడంతో ముందు ఆ పదవిని భర్తీ చేసి, తర్వాత చైర్మెన్, డిప్యూటీ చైర్మెన్ ఎంపికను పూర్తి చేయాలి. ఈ క్రమంలో మండలి పదవుల కోసం సీనియర్లంతా ఇప్పటికే లాబీయింగ్‌ను మొదలు పెట్టారు. మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. గతంలో చైర్మెన్‌గా వ్యవహరించిన క్రమంలో మళ్లీ ఆయనకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ గుత్తా మాత్రం క్యాబినెట్ బెర్తుపై గంపెడాశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎల్. రమణ, బండ ప్రకాష్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు వినికిడి. మరోవైపు డిప్యూటీ చైర్మెన్ పదవి కోసం సీనియర్ ఎమ్మెల్సీలు ఎమ్ఎస్ ప్రభాకర్, పట్నం మహేందర్‌రెడ్డి, కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్ ఇప్పటికే తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. వీటితోపాటు శాసనమండలి చీఫ్‌విప్‌తో పాటు విప్ పదవులు కూడా ఖాళీ అయ్యాయి. వీటికోసం కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఇందుకోసం పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, నవీన్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.