Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కాళేశ్వరం' కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఏం
- దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే : బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ అధ్యక్షులు జయప్రకాశ్ నడ్డా విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా జాగరణ కార్యక్రమం చేపట్టిన ఎంపీ, తమ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజరుకుమార్ను అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. ఎంపీపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని తప్పుబట్టారు. దీనిపై ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని చెప్పారు. కేసీఆర్ అప్రజాస్వామిక పాలనపై పోరాడుతామన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందనీ, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఏంగా మారిందని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ బుర్ర పనిచేయడం లేదనీ, ఆయనకు మతిభ్రమించిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ధర్మయుద్ధం చేస్తుందనీ, జీవో 317 జీవో రద్దు కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సీఎం తన కుటుంబం కోసం రాచరిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తనను అడ్డుకోవడానికే అన్నట్టుగా ఎయిర్‌పోర్టులో పోలీసులు పనిచేశారన్నారు. బండి సంజరు కు పోరాటానికి జాతీయ పార్టీగా అండగా ఉందన్నారు. తెలంగాణ మంత్రుల ర్యాలీలు, సభలకు ఎలా అనుమతి ఇస్తున్నారని పోలీస్ అధికారి కార్తికేయను అడిగితే అతని వద్ద సమాధానం లేదన్నారు. ఉద్యోగులు, ప్రజల కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపటానికి వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదీ చేయదనీ, చేసేవారిని చేయనివ్వదని విమర్శించారు. కేసీఆర్‌తో పోరాడేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. తన కార్యక్రమాలను బట్టి కరీంనగర్ వెళ్లాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
హిమాన్ష్‌పై నడ్డా కామెంట్...
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ మనువడు ఒక్కడే తక్కువైండని జేపీ నడ్డా ఎద్దేవాచేశారు. ఇప్పటికే సీఎం కుమారులు, కూతురు, అల్లుడు రాజకీయాల్లో ఉన్నారనీ, కేసీఆర్ తన మనువడిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, నేతలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, ప్రకాశ్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.