Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా, నియోకర్సర్ సంయుక్తధ్వర్యంలో ప్రారంభం
- ఇంగ్లీష్ ఫౌండేషన్‌లో శిక్షణ
- సావిత్రిబాయి ఫూలేకు ఇది నిజమైన నివాళి : లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆడపిల్లల కోసం నియోకర్సర్, ఐద్వా కలిసి 'షీ' సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని సావిత్రిబాయి హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (షీ) సెంటర్‌ను హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభించాయి. ఆడపిల్లలు విద్యాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఈ షీ సెంటర్ కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీద పట్టు కల్పించేందుకు, వినడం, మాట్లాడ్డం, రాయడం, చదవడం వంటి అంశాల్లో పునాది వేసేందుకు ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్టు వివరించారు. షీ సెంటర్ లోగోను ఓయూ ప్రొఫెసర్ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే 167 ఏండ్ల క్రితం ఆడపిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించారని గుర్తు చేశారు. అదీ అంటరానివారిని చేరదీసి ఇంగ్లీష్ పాఠాలు నేర్పారని అన్నారు. ఆమె మీద అనేక దాడులు జరిగినా వాటిని తట్టుకుంటూ, తిప్పికొడుతూ అనుకున్న కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు జీవితాన్ని ధారపోశారని చెప్పారు. దేశంలో చదువుల తల్లి ఎవరైనా ఉన్నారంటే అది సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. నియోకర్సర్ జనరల్ సెక్రెటరీ జగదీశ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలు రెండోశ్రేణి మనుషులుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య,వైద్యం, మౌలిక సౌకర్యాల కల్పనలోనూ వారిపై ఖర్చు చేసేందుకు కుటుంబాలు సిద్ధపడడం లేదని చెప్పారు. దీంతో వారు చదువుకున్న అంశాల్లోనూ, వృత్తి నైపుణ్యాల్లోనూ పట్టు సాధించలేకపోతున్నారని అన్నారు. ఈ సమస్యను గుర్తించి కొంతమందికైనా సహకరించేందుకు ఐద్వా, నియోకర్సర్ కలిసి సంయుక్తంగా కృషి చేయబోతున్నాయని వివరించారు. ఐద్వా నగర కార్యదర్శి నాగలక్ష్మి మాట్లాడుతూ నియోకర్సర్ తోడ్పాటుతో షీ సెంటర్‌ను ఐద్వా నడుపుతుందని చెప్పారు. దీన్ని విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. దీని నిర్వహణకు అవసరమైన కమిటీని ఐద్వా ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ సెంటర్ కోఆర్డినేటర్ లెల్లెల భవాని, నియోకర్సర్ ప్రాజెక్టు హెడ్ రాణాప్రతాప్, అడ్మిన్ మేనేజర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.