Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డినా సరే వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేంద్రం నిర్దేశించిన 46 లక్షల క్వింటాళ్ల బియ్యానికి సమానంగా 68.65 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణకుగాను సోమవారం నాటికి 65.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని స్పష్టం చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.... రైతులకు ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో 6,868 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ మొదలెట్టామనీ, ఇందులో సేకరణ పూర్తయిన 4,808 కేంద్రాలను మూసివేశామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్‌పై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ దాదాపు పూర్తి కావచ్చిందని స్పష్టం చేశారు. 11 లక్షల 90 వేల మంది రైతుల నుంచి రూ.12,761 కోట్ల విలువ గల ధాన్యాన్ని సేకరించగా, ఇందులో 8 లక్షల మందికి రూ.10,394 కోట్లను అందజేసినట్టు వెల్లడించారు. భారత ఆహార సంస్థకు కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను అందజేసే ప్రక్రియ కూడా కొనసాగుతున్నదనీ, వానాకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేసినట్టు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్ రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, వాణీభవాని, నసీరుద్దిన్, జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తధితర అధికారులు పాల్గొన్నారు.