Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొద్దుపొయ్యేంత వరకూ కొనసాగిన సోదాలు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో పేరు పొందిన నిత్య రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖాధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్లో గల నిత్య రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయంపై ఐటీ అధికారులు ఉదయం నుంచే దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. గతేడాది నిత్య రియల్ ఎస్టేట్‌కు చెందిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను చెల్లింపులు, రిటర్న్స్ దాఖలులో లోపాలు దొర్లినట్టు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా, తమ ఆదాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించడంలో నిబంధనల ప్రకారం నిత్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవహరించలేదని తెలుస్తోంది. దీంతో అమీన్‌పూర్‌లోని కార్యాలయంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. బుధవారం పొద్దుపోయేంత వరకూ ఐటీ సోదాలు ఈ కార్యాలయంపై కొనసాగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అకౌంట్స్‌కు చెందిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.