Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వనపర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. వనపర్తికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 24 ఎకరాల పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలోనే ఇంజినీరింగ్ కాలేజీ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. తాత్కాలికంగా పాలిటెక్నిక్ కాలేజీలోనే వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలు ప్రారంభమవుతాయి. రెగ్యులర్ క్యాంపస్ నిర్మాణం తర్వాత అక్కడి నుంచి తరలిస్తారు. 1958లోనే వనపర్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటైంది. అక్కడ ఇప్పటికే మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలం సమీపంలో ఇంజినీరింగ్ కాలేజీకి 25 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. దక్షిణ తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల వనపర్తికి రావడం గమనార్హం. అక్కడ విద్యా ప్రాముఖ్యాన్ని, సాహితీ, సాంస్కృతిక కేంద్రంగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జేఎన్టీయూకు అనుబంధంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ (క్యాంపస్)తోపాటు సుల్తాన్పూర్, మంథని, జగిత్యాల, సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఇప్పుడు వనపర్తికి ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీ మంజూరైంది. దీంతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య ఆరుకు చేరింది.