Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 78.76 లక్షలు
న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం నిబంధనల పేరుతో విదేశీ విరాళాలు అందకుండా చేయడంతో కష్టాలు ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీను ఆదుకోవడానికి ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్రంలో చారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న 13 సంస్థలకు రూ. 78.76 లక్షల ఆర్థిక సహాయం చేయనుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 'ఒడిశాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉండాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ సంస్థలలో ఎవరూ ముఖ్యంగా ఆహార భద్రత, ఆరోగ్య సంబంధిత బాధలతో బాధపడకుండా చూసుకోవాలని ఆయన వారిని ఆదేశించారు. అవసరమైన చోట ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు ఈ పనికి వినియోగించుకోవచ్చు' అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మిషనరీస్ ఆఫ్ చారటీను కొల్కతా ప్రధాన కేంద్రంగా 1950లో మదర్ థెరిస్సా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఒడిశాలో అనేక కుష్టురోగుల గృహాలను, అనాధశ్రమాలను నిర్వహిస్తుంది. విదేశీ దాతల నుంచి విరాళాలు స్వీకరించడానికి అనుమతించాలని డిసెంబరు 25న మిషనరీస్ ఆఫ్ చారిటీ చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
ఈ సంస్థతో పాటు దేశంలోని అనేక ఎన్జీఓలకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) అనుమతి పునరుద్దరణకు కేంద్రం తిరస్కరించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ సంస్థలన్నీ తమ సహయ కార్యక్రమాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎఫ్సీఆర్ఏ అనుమతిని తిరస్కరించడానికి ఎలాంటి బలమైన కారణాలు లేవని, కేవలం అణచివేత చర్యల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సంస్థ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.