Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకార ఎన్నికల అధికారికి జీఎంపీఎస్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల(సొసైటీల)కు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీఎంపీఎస్) కోరింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి వి సుమిత్రకు ఆ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7,925 ప్రాథమిక గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాలున్నాయనీ, వాటి పాలకవర్గాల పదవీకాలం ముగిసి పదేండ్లు గడుస్తున్నా...ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం మొత్తంలో కేవలం వనపర్తి జిల్లాలోని 1,209 సొసైటీలకు మాత్రమే ఎన్నికలు జరిపి మిగతా జిల్లాలలోని 6,716 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించలేదని గుర్తు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఐదేండ్లు కావస్తున్నా... జిల్లా యూనియన్లను కొత్త జిల్లాల ప్రతిపాదికన విభజన చేయకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు డీసీసీబీల్లో సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు. వీటి ఎన్నికలు జరపకపోవడంతో గతేడాది జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కొన్ని సొసైటీల వారు ఫోటో ఎన్నికల ఓటరు జాబితా తయారు చేసి ఎన్నికల నిర్వహణకు ఫీజు కోసం డీ.డీలు తీసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మల సంక్షేమానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో సొసైటీల ప్రమేయం లేకపోవడంతో అక్రమాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఫలితంగా సొసైటీల కార్యకలాపాలన్నీ కుంటుపడి సహకార స్ఫూర్తి దెబ్బతింటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సొసైటీ ఎన్నికలు నిర్వహించి, జిల్లా యూనియన్లను విభజించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విధివిధానాలు పశుసంవర్ధక శాఖకు పంపామనీ, వారినుండి ప్రతిపాదనలు వస్తే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామనిఈ సందర్భంగా ఎన్నికల అధికారి సుమిత్ర హామీనిచ్చారని తెలిపారు.