Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లతరబడి పెండింగ్
- సర్కారుకు నియామకాల దస్త్రం
- పెరిగిన పనిభారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర భారీనీటిపారుదల, ఆయకట్టు శాఖలో ఉద్యోగ నియామకాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్నాయి. వీటిని ఏండ్ల తరబడి భర్తీచేయకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం తీవ్రమవుతున్నది. టెక్నికల్, నాన్టెక్నికల్ పోస్టుల నియామకాల్లో ఆలస్యం జరుగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల పనులు, ఇతర వ్యవహారాలతో నిత్యం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీరికలేకుండా ఉంటున్నది. సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రాధాన్యత ఇస్తూ గులాబీ సర్కారు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. 2018లో ఒకసారి ఇంజినీర్ల పోస్టులు భర్తీ చేశారు.2016 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్లను రిక్రూట్ చేశారు. వారికి గత ఏడాది చివరలో నియామక ఉత్తర్వులు అందాయి. అప్పట్లో ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేశారు. ఆతర్వాత మళ్లీ వాటి జోలికి పోలేదు. దీంతో ప్రతియేటా ఉద్యోగ విరమణ చేసేవారితో ఖాళీలు భారీగా పేరుకుపోయాయి. ఇందులో ఇంజినీర్ల పోస్టులు కీలకంగా ఉన్నాయి. జోనల్, మల్టీజోనల్, జిల్లా క్యాడర్లకు సంబంధించిన పోస్టులు దాదాపు 3600కుపైగా ఖాళీ ఉన్నట్టు సమాచారం. మల్టీజోన్ల పరిధిలో ఏఈ, ఏఈఈ, టీవోలు, స్పెషల్ గ్రేడ్ టీవోలు మొత్తం 3039 పోస్టులు ఉండాల్సి ఉండగా, కేవలం 925 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా ఐదు జోన్లకు సంబంధించి పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, ఏటీవో, జేటీవో, టెక్నికల్ అసిస్టెంట్లు మొత్తం 1854 పోస్టులకుగాను 606 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా క్యాడర్లకు సంబంధించి పరిశీలించిప్పుడు 3550 పోస్టులకు గాను 2644 పోస్టుల్లో మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. మల్టీజోన్ ఒకటిలో 1149, మల్టీజోన్ రెండులో 776 పోస్టులు భర్తీకాలేదు. ఇదిలావుండగా జోన్-1లో 148, జోన్-2లో 146, జోన్-3లో 228, జోన్-4లో200, జోన్-5లో 186, జోన్-6లో 139, జోన్-7లో 191 పోస్టులు భర్తీచేయాల్సి ఉందని తెలిసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ సంబంధించిన పోస్టులు వీటిలో ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ పోస్టులకు భర్తీకి సంబంధించి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తాజాగా మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేఖ రాశారు. కాగా, సర్కారు నుంచి ఎలాంటి స్పందనా లేదు. రాష్ట్రంలో అత్యధికంగా పనులు జరుగుతున్న శాఖ ఏదైనా ఉందీ అంటే, అదీ భారీనీటిపారుదల శాఖనే కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నీటిపారుదల శాఖలో దాదాపు మూడేండ్లకుపైగా పోస్టులను భర్తీచేయకుండా ఉంచడంలో ఉన్నతస్థాయి ఇంజినీర్లు, ఉద్యోగులపై పనిభారం పడుతున్నదని ఆ శాఖల్లోని ఇంజినీర్ల అసోసియేషన్లు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.