Authorization
Fri April 11, 2025 04:00:31 am
- ఆశా వర్కర్స్‌్ యూనియన్
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత
- 11 నుంచి జిల్లాలో పాదయాత్ర
- వేతనాలు పెంచే వరకూ దశలవారీగా పోరాటాలు
నవతెలంగాణ - వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ.. వేతనాలు పెంచడం లేదని తెలంగాణ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.గిరిజ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశాలకు జనవరి నుంచి వేతనాలు పెంచుతామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటన చేసి అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కరోనా కాలంలో ప్రాణం అరచేతిలో పెట్టుకుని పనులు చేశారని, అందులో కొందరు కరోనాతో మృతిచెందారని గుర్తు చేశారు. అలాగే, పీఆర్సీ వర్తింపజేస్తామన్న ప్రభుత్వ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీలో మాదిరిగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలివ్వాలని, పీఆర్సీ వర్తింపజేయాలన్నారు. కరోనాతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
పై సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11 నుంచి జిల్లాలో పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. వేతనాలు పెంచే వరకూ దశల వారీగా పోరాటాలు చేస్తామని, ప్రతి ఆశా కార్యకర్త పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండ్ల రాజు, పుట్ట ఆంజనేయులు, ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి భాగ్య, ఉపాధ్యక్షురాలు బుచ్చమ్మ, దేవమ్మ, నాయకులు సత్యమ్మ, సుజాత, శ్యామల, లావణ్య, నిర్మల, మంజుల, రజిత, సంగీత పాల్గొన్నారు.