Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకు హైకోర్టులో ఊరట లభించింది. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి కరీంనగర్లో దీక్ష చేయడాన్ని అడ్డుకోడానికి వెళ్లిన తమపై ఎంపీ అనుచరులు దాడి చేశారనే కేసులో బండి సంజరును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అధికారిపై దాడికి పాల్పడ్డారనే అభియోగం కూడా నమోదు అయ్యింది. ఈ కేసులో అక్కడి కోర్టు ఆయనకు ఈనెల 17 వరకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎంపీ దాఖలు చేసిన రిట్‌ను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ జరిపారు. వ్యక్తిగత పూచీకత్తులు తీసుకుని ఎంపీ సంజరును విడుదల చేయాలని బుధవారం పోలీసులను ఆదేశించారు. ఎంపీగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసుండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు పరిపాటని వ్యాఖ్యానించారు. అయితే కరోనా ఉన్నందున బయటకు వచ్చిన తర్వాతైనా ఎంపీ కోవిడ్ మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురికి ఊరట
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు కూడా హైకోర్టులో ఊరట లభించింది. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆయనపై ఆ జిల్లా పోలీసులు ఎస్సి, ఎస్టి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్, ఇతర ప్రక్రియను నిలిపివేయాలనీ, కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ జరిపి, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అరవింద్‌పై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించారు. ఈ కేసు విచారణ కూడా ఫిబ్రవరి 7కి వాయిదా పడింది
ఆర్ఆర్ఆర్ సినిమాపై పిల్
కొమురంభీం, అల్లూరి సీతారామరాజుల చరిత్రకు భిన్నంగా ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించారనీ, అందువల్ల ఆ సినిమా విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. విద్యార్థిని సౌమ్య వేసిన పిల్‌ను బుధవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారిస్తుందని కోర్టు తెలిపింది. ఇందులో సెన్సార్ బోర్డులు, చిత్ర నిర్మాతలు, దర్మకుడు రాజమౌళి, రచయితలను ప్రతివాదులుగా చేశారు.