Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారి దేశాల్లో బలపడుతున్న కమ్యూనిస్టులు
- వాగ్దానాల వీరుడు కేసీఆర్: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ఆటంకాలు అధిగమించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు
- జిల్లా కార్యదర్శిగా అన్నవరపు కనకయ్య
- 36మందితో జిల్లా కమిటీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాజద్రోహం కేసులు.. రాక్షస చట్టాలను అమలు చేయడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్పొరేట్ తొత్తుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీతో ముప్పు పొంచి ఉందనే ఆందోళనతోనే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టులు బలపడితే పెట్టుబడిదారీ శక్తులకు ప్రమాదం కాబట్టే ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే అశ్వారావుపేటలో జరగాల్సిన సీపీఐ(ఎం) జిల్లా మహాసభలకు ఆటంకం కల్పించారన్నారు. సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండో మహాసభ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా జిలుగుమిల్లులోని సున్నం రాజయ్యనగర్, కుంజా బొజ్జి, తానం రవీందర్ ప్రాంగణంలో మంగళ, బుధవారాల్లో కొనసాగాయి. పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన ప్రారంభమైన ఈ మహాసభకు తమ్మినేని హాజరై మాట్లాడారు.
ప్రస్తుత కాలంలో ప్రజలు ఆర్థిక దోపిడీ, పీడన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు. ఆధిపత్య ధోరణిలో భాగంగానే ఇటీవల మోడీ ప్రభుత్వం స్త్రీల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హామీల మీద హామీలిస్తూ.. ఏ ఒక్క హామీనీ సరిగ్గా అమలు చేయకుండా వాగ్ధానాల వీరుడిగా ఘనతకెక్కారని విమర్శించారు. మోడీపై యుద్ధం అని ప్రకటించి ఢిల్లీ వెళ్లి అక్కడ తోక ముడుస్తున్నారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నా అవన్నీ తాత్కాలికమేనని తెలిపారు. పోడుభూములపై పోరాటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ(ఎం) అగ్రపథంలో ఉందన్నారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. మహాసభ ప్రారంభానికి ముందుగా పార్టీ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య జెండా ఆవిష్కరించగా, ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజే రమేశ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, బి.వెంకట్, ఎం.సాయిబాబు, మిడియం బాబూరావు, పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఆహ్వానసంఘం అధ్యక్షులు కొక్కెరపాటి పుల్లయ్య, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యదర్శిగా కనకయ్య
సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా అన్నవరపు కనకయ్య ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 36 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. వీరిలో ఇద్దరు కోఆప్షన్ సభ్యులు. 10మందితో కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా అన్నవరపు కనకయ్య (కార్యదర్శి), మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, మందలపు జ్యోతి, కొలగాని బ్రహ్మచారి, జాటోత్ కృష్ణ, లిక్కి బాలరాజు, ఎం.బీ. నర్సారెడ్డి, కారం పుల్లయ్య ఉన్నారు.