Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీ యాజమాన్యాల సమాలోచన
- ఫీజుల సవరణకు టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్
- వృత్తి విద్యాకళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
- ఆన్లైన్లో ఆదాయ, వ్యయాల సమర్పణ గడువు ఫిబ్రవరి 28
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కోర్సుల ట్యూషన్ ఫీజుల పెంపునకు రంగంసిద్ధమైంది. ఫీజులు భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఈ దిశగా కాలేజీ యాజమాన్యాలు సమాలోచన చేస్తున్నాయి. 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు ఫీజుల సవరణ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కాలేజీ యాజమాన్యాలు ఆదాయ, వ్యయాల వివరాలను ఆన్లైన్లో సమర్పించేందుకు తుది గడువు వచ్చేనెల 28వ తేదీ వరకు ఉందని ప్రకటించింది. http://tafrconlince.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆదాయ, వ్యయాల వివరాలు, ఆడిట్ నివేదికలతో కూడిన ప్రతిపాదనలను కాలేజీ యాజమాన్యాలు సమర్పించాలి. ఈ ఫీజుల సవరణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వాటికి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశమున్నది. రాష్ట్రంలో మూడేండ్లకోసారి ఇంజినీరింగ్సహా వృత్తి విద్యా కోర్సుల ట్యూషన్ ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేస్తుంది. గతంలో 2016-17, 2017-18, 2018-19 విద్యాసంవత్సరాలకు ఫీజులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు ఖరారు చేసిన ఫీజులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.
అందరి చూపు ఆ కాలేజీల ప్రతిపాదనలపైనే...
రాష్ట్రంలో ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఫీజు ప్రతిపాదనలు ఎంత సమర్పిస్తాయన్నదానిపైనే అందరి చూపు ఉన్నది. ముఖ్యంగా సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, విఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి, గోకరాజు రంగరాజు, వర్ధమాన్, అనురాగ్, ఎంజీఐటీ, మాతృశ్రీ, ముఫకంజా, భోజిరెడ్డి, బీవీ రాజు, సీవీఆర్, జి నారాయణమ్మ, వీజేఐటీ, గురునానక్, గీతాంజలి, ఎంఎల్ఆర్డీ, సీఎంఆర్ వంటి కాలేజీ యాజమాన్యాలు భారీగానే ఫీజులు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో అత్యధికంగా రూ.1.34 లక్షలు, అత్యల్పంగా రూ.35 వేల ట్యూషన్ ఫీజు అమల్లో ఉన్నది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఫీజు అత్యధికంగా రూ.1.34 లక్షలున్నది. ఆ తర్వాత వాసవి, శ్రీనిధి కాలేజీల ఫీజు రూ.1.30 లక్షలున్నాయి. వచ్చే మూడు విద్యాసంవత్సరాలకు సీబీఐటీ 50 శాతం ఫీజు పెంచాలని ప్రతిపాదనలు సమర్పిస్తే అది రూ.2.68 లక్షలు, 40 శాతం ప్రతిపాదిస్తే ఆ ఫీజు రూ.1,87,600 అవుతుంది. 30 శాతం అడిగితే ఆఫీజు రూ.1,74,200కు పెరిగే అవకాశమున్నది. రాష్ట్రంలో కనీస ఫీజు రూ.35 వేలు ఉన్నది. దాన్ని అలాగే కొనసాగించాలని టీఏఎఫ్ఆర్సీ భావిస్తున్నది. 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియడ్‌లో ప్రభుత్వం ఫీజును ఎక్కువగా పెంచలేదన్న అభిప్రాయం కాలేజీ యాజమాన్యాల్లో ఉన్నది. అందుకే 2022-23 నుంచి 2024-25 వరకు విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు ఫీజు పెంపు కోసం భారీగా ప్రతిపాదనలు సమర్పించేందుకు కాలేజీ యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, ఫార్మసీ, బీఎడ్ కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. ప్రతిపాదనలు స్వీకరించాక కాలేజీల వారీగా టీఏఎఫ్ఆర్సీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఏప్రిల్ లేదా మే నాటికి కాలేజీల వారీగా ఫీజులను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి సమర్పిస్తుంది. ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత 2022-23 నుంచి 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్పీరియడ్ ట్యూషన్ ఫీజు ఖరారుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తుంది.