Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రధాని మోడీ రైతు విరోధి. అందుకే ఆయన్ను పంజాబ్‌లో రైతులు అడ్డుకున్నారు...' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. అక్కడ అన్నదాతల నిరసనలతో ఆయన తన సభలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదురు కాలేదని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా... ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, తమ ప్రభుత్వంపైనా జుగుప్సాకరమైన, హేయమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇలాంటి కామెంట్లతో ఆయన తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ది స్టేట్స్‌మెన్ పాలన అయితే, మోడీది సేల్స్‌మెన్ పాలనంటూ ఎదురు దాడి చేశారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాసగౌడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. బీజేపీని 'బాక్వాస్ జుమ్లా పార్టీ...'గా ఆయన అభివర్ణించారు. ఆ పార్టీ దేశంలోని మీడియాను మోడియాగా మార్చిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఏడేండ్లలో ఒక్క మంచి పనీ చేయలేదని విమర్శించారు. కాషాయ పార్టీకి సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ భాగస్వామ్య పార్టీలుగా మారాయని ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అభివృద్ధి ఆధారంగా బీజేపీ ఓట్లను అడగటం లేదనీ, విద్వేషాలు రెచ్చగొట్టటం, విష ప్రచారాల ద్వారా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టిస్తామంటూ బీజేపీ హామీనిచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనైనా ఇండ్లను కట్టించారా..? అని ప్రశ్నించారు. రైతులకు ఆదాయం రెట్టింపు, మద్దతు ధర ఏమయ్యాయని నిలదీశారు. ప్రతీ ఇంటికి టాయిలెట్, నల్లా అంటూ వాగ్దానం చేసిన మోడీ... కనీసం సొంత రాష్ట్రం గుజరాత్‌లోనైనా వాటిని నిర్మించి ఇచ్చారా..? అని అన్నారు. నడ్డా అనే నాయకుడు... అబద్ధాలకు అడ్డాగా మారారనీ, ఆయన కేరాఫ్ ఎర్రగడ్డంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నిటి అయోగ్ ప్రశంసిస్తుంటే, అందుకు భిన్నంగా నడ్డా వాటిలో లోపాలున్నాయంటూ చెప్పటం దారుణమన్నారు.
బీజేపీ నేతలు ప్రజాస్వామ్యం గురించీ, కుటుంబ పాలన గురిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు లేదా..? అంటూ ప్రశ్నించారు. లక్షలాది మంది అన్నదాతల గోస బీజేపీకి తగులుతుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కుమారుడు రైతులను కార్లతో తొక్కించి, చంపినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్నాటకలోనే అవినీతి అత్యంత ఎక్కువగా ఉందంటూ పలు మీడియా సంస్థలు, మేధావులు వెల్లడించారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా సమాధానమిచ్చిందని తెలిపారు. తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. వారి స్థానికత కోసమే 317 జీవోను విడుదల చేశామని వివరించారు.