Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మధ్యాహ్న భోజన పథకానికి మెల్లగా ఎసరు పెట్టేం దుకు సర్కారు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మొదట్నుంచీ పెద్దగా కనికరం చూపించని ఈ స్కీంపై నిత్యం నిర్లక్ష్యపు నీడలే కనిపిస్తున్నాయి. జైల్లో ఉండే ఖైదీకి కనీసం రూ.30 ఇచ్చి భోజనం పెట్టి స్తున్న సర్కారు.. బావితరాలను తీర్చిదిద్దే బళ్లో మాత్రం ఒక్కో పిల్లవానికి రూ.7 ఖర్చు చేసేందుకు వెనకాడుతోంది. అదీ నెలల తరబడి ఖర్చులు ఇవ్వ కుండా భోజన నిర్వాహకులను తీవ్ర ఇక్కట్లు పెడు తోంది. మొన్నటివరకు అప్పుల్జేసి పిల్లల కడుపునిం పిన కార్మికులు.. ఇప్పుడు బాకీ చేసే స్తోమత లేక వంటకు దూరంగా ఉన్నారు. ఎలాగూ ఈనెల 8 నుంచి బడికి సెలవులు వస్తున్న క్రమంలో ప్రభుత్వం వీరి బాధే పట్టించుకోవడవం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులు రాకపోవడం.. మరోవైపు వంట గ్యాస్ ధరలు పెరగడం.. నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కడంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వంట వండ టం ఒక తంటలా మారింది. బిల్లుల మాటేమోగానీ కనీసం గౌరవ వేతనమూ అందడం లేదు. బిల్లులు ఎప్పటికైనా వస్తాయనే ఆశతో అప్పులు చేసి మరీ పిల్లలకు భోజనం పెట్టిన నిర్వాహకులు మొన్నటి వరకూ ఆ భారం మోస్తూ వచ్చారు. చివరికి వారంలో మూడ్రోజులు పెట్టాల్సిన గుడ్డు కొనలేకపోయారు. రోజువారీ కూరగాయలతో వండి పెట్టాల్సిన పరిస్థి తుల్లో ధరలు పెరగడంతో పప్పు, చారు, కిచిడి, వెజి టెబుల్ రైస్ ఇలా తక్కువ ఖర్చుతో అయ్యే భోజనాన్ని పిల్లలకు అందించారు. అయినా ఇంకా బిల్లులు రాక పోయేసరికి ఆ వంటకాన్నీ నిలిపివేశారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలోని 437 ప్రాథమిక, 76 ప్రాథమికోన్నత, 149 ఉన్నత పాఠశాలల్లోని 47వేల మందికి, ఇటు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 336 ప్రాథమిక, 39 ప్రాథమికోన్నత, 135 ఉన్నత పాఠశా లల్లోని 43వేల మందికి మధ్యాహ్న భోజనం అం దుతోంది. వీరంతా ఇప్పుడు ఇండ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. జైల్లో ఖైదీకి భోజనం కింద రోజువారీ ఖర్చు రూ.30వరకు జైళ్ల శాఖ చెల్లిస్తోంది. అయితే, ఆ మొత్తం కూడా పెరిగిన ధరల దృష్టా ఖైదీకి సరిపోదు. మరి పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే రోజువారీ ఖర్చు రూ.7కూడా దాటడం లేదు. ప్రైమరీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ నాలుగు రూపాయల 75పైసలు మాత్రమే. ఉన్నత పాఠశాల విద్యార్థికి 7రూపాయల వరకు చెల్లిస్తోంది.
అయితే, బయట ఒక్కో కాయగూర ధర కిలో రూ.60పైనే పలుకుతోంది. రోజువారీగా వాడే టమాట, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలే కిలో రూ.80వరకు ఉండగా.. ఆ రేటు పెట్టి మధ్యాహ్న భోజన నిర్వాహకులు భోజనం వడ్డించలేక పోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఖర్చులో బియ్యం మినహా ఉప్పులు, పప్పులు, మసాలాలు అన్నీ నిర్వాహకులే కొనాల్సి ఉంది. అయితే, ఇచ్చే ఆ చిన్న మొత్తం కూడా ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్లో పెట్టడంతో అప్పులు చేసి వంట చేసే పరిస్థితిలో మధ్యాహ్నభోజన కార్మికులు లేరు.