Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ - బోనకల్
ఈ ఏడాది మామిడి తోటలతో అన్నదాతల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. పడిన పూత నల్ల బారి పోతుండటంతో లక్షలాది రూపాయలతో మామిడి తోటలు కొనుగోలు చేసిన అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో చిరునోముల గ్రామంలో సుమారు 500 ఎకరాల్లో మామిడి తోటలు ఉండటం ప్రత్యేకతం. అంటేకాదు, మండలంలోని గోవిందాపురం ఎల్, మోటమర్రి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లోనూ సుమారు మరో 500 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. చిరునోముల గ్రామానికి చెందిన మామిడి తోటల్లో హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారస్తులు మామిడి కాయలను కొనుగోలు చేస్తారు. అంత ప్రాధాన్యత చిరునోముల మామిడి తోటలకు ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల కల్లా మామిడి తోటలు పూలతో కళకళలాడుతాయి. డిసెంబర్ మధ్య నుంచి జనవరి నాటికి పూత మొత్తం పిందెలుగా మారతాయి. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా మామిడితోటలు దర్శనమిస్తున్నాయి. మామిడి తోటలకు నల్ల నల్లి సోకింది. దాంతో పూత నల్లగా మారి రాలిపోవడమే కాక కొత్త పూత పడటం లేదు. ఫలితంగా మామిడి తోటలో పూత, పిందె లేకుండా దర్శనమిస్తున్నాయి. దాంతో మామిడి తోట రైతులందరికీ కష్టాలు తప్పని పరిస్థితి కనిపిస్తుంది.
రూ. 15 లక్షలతో 60 ఎకరాలు కొనుగోలు చేశాం: సావిటి లింగయ్య, గొల్ల కోటేశ్వరరావు, చిరునోముల రైతులు
చిరునోములలో 30 ఎకరాలు, కారేపల్లి మండలం పండితాపురంలో 20 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మండలం దబ్బాకుపల్లిలో 10 ఎకరాలు.. మొత్తం 60ఎకరాలు రూ.15 లక్షలకు కొనుగోలు చేశాం. ఈ తోటల్లో పూత కాపాడేందుకు మందులు స్ప్రే చేయడానికి సుమారు రూ. 6 లక్షలు ఖర్చుచేశాం. భూమి మందు మరో రూ.2లక్షలు పెట్టుబడి పెట్టాం. మొత్తంగా ఇప్పటివరకూ పెట్టుబడికే రూ. 21 లక్షలు పెట్టా. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రూ 21 లక్షల్లో కనీసం 20 శాతం కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
రూ.4లక్షలతో 10 ఎకరాలు తీసుకున్నా :
గోళ్ల కోటేశ్వరరావు, చిరునోముల
నాలుగు లక్షలతో 10 ఎకరాలు కొనుగోలు చేశా. కానీ ఒక్క ఎకరంలో కూడా పూత, పిందె లేదు. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పడిన పూత మొత్తం నల్లబడి రాలిపోతుంది. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి అని భయంగా ఉంది.