Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతల మెడకు రుణమాఫీ కత్తి
- అప్పు కింద జమ చేసుకుంటున్న బ్యాంకులు
- పెట్టుబడిరాక అప్పులోళ్ల వేధింపుల్లో రైతన్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అన్నదాతలు 'రైతుబంధు' చిక్కులు ఎదుర్కొంటు న్నారు. యాసంగి పంట పెట్టుబడి కోసం ఆ డబ్బులు ఉపయోగ పడుతాయని భావించిన రైతుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రైతు ఖాతాల్లో పడుతున్న రైతుబంధు సొమ్మును బ్యాంకర్లు ఫ్రీజింగ్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల్లో విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతున్నది. వారి ఖాతాల్లో పడినట్టు రైతుకు మేసేజ్ వస్తున్నది. కానీ ఖాత్లాల్లో డబ్బులు కనిపించడం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకు మేనేజర్ సైతం రుణం తీసుకుని రైతులు చెల్లించడం లేదనీ, ఈ విధంగా ఫ్రీజింగ్ చేయడం ద్వారా కనీసం వడ్డీ అయినా చెల్లిస్తారనే ఉద్దేశంలో ఆపుతున్నట్టు ఆయన చెప్పారు. రైతురుణానికి వడ్డీకి వడ్డీ పెరిగిపోయి వారు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రుణాలు చెల్లించనందున రైతుబంధు సొమ్ము ఇవ్వడం లేదు. రుణం చెల్లిస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామంటూ బ్యాంకులు మెలిక పెడుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుకు, రుణమాఫీకి ముడిపెట్టకుండా పెట్టుబడి సాయాన్ని రైతుకు చెల్లించాలని చెబుతున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడా పదే పదే చెబుతున్నా... బ్యాంకులు పెడచెవిన పెడుతున్నాయి. రైతుబంధు సొమ్ము ఇవ్వా లంటూ మెదక్‌లో బ్యాంకులు వద్ద రైతులు ధర్నాలు, నిరసనలు తెలిపాయి. రైతు సొమ్మును కొన్ని బ్యాంకులు మాత్రమే ఫ్రీజింగ్ చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్రీజింగ్ అయినచోట పంట పెట్టుబడికి ఇబ్బందులు వస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు సొమ్ముతోపాటు ధాన్యం అమ్మిన సొమ్ము కూడా బ్యాంకులు మినహాయించుకోవడం గమనార్హం.
లక్ష రుణమాఫీ ఏది ?
డిసెంబర్ 2018 వరకు లక్ష రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పింది. అందులో రూ.25 వేలలోపు రైతులకు చేసింది. ఆపై ఉన్న రుణాలు విడతలవారీగా చెల్లిస్తున్నారు. లక్ష రుణమాఫీని ఏకకాలంలో చేయకపోవడంతో రైతులపై అప్పుల భారం పడుతున్నది. ఏడాదిలోపు చెల్లిస్తేనే వడ్డీలేని రుణం వర్తిస్తున్నది. అది కాకపోవడంతో రుణ బకాయిలు పెరిగిపోతు న్నాయి. రుణమాఫీ చేస్తున్న ఆశలో రైతులు వాటి జోలికిపోవడం లేదు. ఫలితంగా రైతులకు అప్పు పెరిగిపోతున్నది. ఇదే అదనుగా భావించిన బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. వారు వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతుబంధు, ధాన్యం సొమ్మును ఫ్రీజింగ్ చేస్తూ, బ్యాంకులు భయపెడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతును మొండిబకాయిదారుడిగా బ్యాంకులు ముద్రవేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 16 లక్షల మంది ఉన్నట్టు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 41 లక్షల మందికి రుణ మాఫీ చేయాల్సి ఉండగా, కేవలం 4 లక్షల మందికి రూ 730 కోట్లు మాఫీ చేసి సర్కారు చేతులు దులుపుకున్నది. రిజర్వుబ్యాంక్ ఆఫ్ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం 18 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్‌లెవల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఖరీఫ్, యాసంగి సీజన్లలో రుణ లక్ష్యాలను భారీగా నిర్ధేశించుకున్నారు. కానీ రుణాల విషయంలో బ్యాంకులు ఆశించిన లక్ష్యాన్ని సాధించడం లేదు. దీంతో రైతులు ప్రయివేటు అప్పుల బారిన పడుతున్నారు.
రైతుబంధు సొమ్ము ఇవ్వడం లేదు : చింతల రాజన్న,
గ్రామం నర్సింగాపూర్, తాడ్వాయి మండలం
నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు డబ్బులు పదివేలు వస్తాయి. ఈసారి క్రాప్‌లోన్ కింద పట్టుకున్నట్టు చెప్పారు. ఎప్పుడైనా సెల్‌కు మేసేజ్ వచ్చేది. ఈసారి రాలే. రుణమాఫీ కాలే. నేను వడ్డీ చెల్లించలేదు. అందుకే కట్ చేశామని చెబుతున్నారు. మా అన్న చింతల మల్లయ్యకు రైతుబంధు కింద వచ్చిన పదివేలు బ్యాంకోళ్లు పట్టుకున్నారు.
వడ్లు బయట అమ్ముకుంటా : వల్లవోజు రాంచంద్రయ్య, కుర్మిద్ద గ్రామం
నాకు 40 బస్తాల పంట పడింది. కానీ ఈసారి మార్కెట్లో అమ్మలేదు. బాకీ కింద డబ్బులు పట్టుకుంటున్నారు. అందుకే బియ్యం పట్టించి హైదరాబాద్‌లో అమ్ముకుంటున్నాను.
రుణమాఫీ వెంటనే చేయాలి : మూడ్ శోభన్,
సహాయ కార్యదర్శి తెలంగాణ రైతుసంఘం
రైతు రుణమాఫీని సకాలంలో చేయకపోవడంతో వడ్డీలు పెరుగుతున్నాయి. వాటిని చెల్లించలేదనే కారణంగా రైతుబంధు సొమ్మును మినహాయించుకుం టున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఇంద్రానగర్, నర్సింగాపూర్ గ్రామాల రైతులు ఇదే రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడ పీఎం కిసాన్ యోజన కూడా ఆగిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయాలి. యాసంగి సీజన్‌కు రుణాలు ఇవ్వాలి.