Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్ష ఫీజులను నిర్ణయించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్, ఫెయిలైన జనరల్, ఒకేషనల్ విద్యార్థులు, హాజరు మినహాయింపు ఉన్న వారు ఆ మేరకే ఫీజులు చెల్లించాలని కోరారు. ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ ఫీజులు కట్టాలని పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులు రూ.490, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ రూ.490, సైన్స్ విద్యార్థులు థియరీకి రూ.490, ప్రాక్టికల్స్‌కు రూ.200 కలిపి మొత్తం రూ.690 చెల్లించాలని వివరించారు. ఒకేషనల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం (థియరీ రూ.490, ప్రాక్టికల్స్ రూ.200) రూ.690, ఫస్టియర్ రెగ్యులర్ ఒకేషనల్ విద్యార్థులు (థియరీ రూ.490, ప్రాక్టికల్స్ రూ.200, బ్రిడ్జీ కోర్సు రూ.150) రూ.840 కట్టాలని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు (థియరీ రూ.490, ప్రాక్టికల్స్ రూ.200) రూ.690, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు (థియరీ రూ.490, ప్రాక్టికల్స్ రూ.200, బ్రిడ్జీ కోర్సు రూ.150) రూ.840 కట్టాలని వివరించారు. ప్రయివేటు విద్యార్థులు ఫస్టియర్‌కు రూ.490, ద్వితీయసంవత్సరానికి రూ.490 చెల్లించాలని తెలిపారు. ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు రూ.490తోపాటు సబ్జెక్టుకు రూ.150 అదనంగా కట్టాలని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇవే ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. అధికంగా ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించారు.
నేటినుంచి ఆన్లైన్లో ఇంటర్ విద్యార్థుల మెమోలు
రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గత అక్టోబర్‌లో రాసిన ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన సబ్జెక్టులన్నింటినీ కనీస మార్కులతో పాస్ చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ప్రాసెస్ చేశామని వివరించారు. ఆన్లైన్ ఫలితాలు, మార్కుల మెమోలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి https://tsbie.cgg. gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చు...
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఆయా సబ్జెక్టుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం చేసుకున్న దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చని జలీల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి https://tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చని వివరించారు.
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను ఉపసంహరించుకో వడానికి ఆప్షన్ సమర్పించడానికి చివరితేదీ ఈనెల 17 వరకు ఉందని తెలిపారు. రద్దు చేసుకున్న విద్యార్థులు వచ్చేనెల ఒకటి నుంచి సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి ఆ డబ్బులు తీసుకోవచ్చని సూచించారు.