Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక కుటుంబం దుర్మరణానికి కారణమైన కుమారుడు రాఘవేంద్రరావు దౌర్జన్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. పాల్వంచలో రామకృష్ణ కుటుంబ బలవన్మరణానికి కారణమైన వనమా రాఘవేంద్రరరావును కఠినంగా శిక్షించాలని కోరింది. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణ కుటుంబం సజీవ దహనమవడానికి కారణమైన వనమా రాఘవేంద్రరావు వేధింపులు మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. ఆయన హద్దులు మీరి ప్రవర్తించారని అన్నారు. ఇలాంటి దుర్మార్గులు, మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాఘవేంద్రరావు దుశ్చర్యలకు సాక్ష్యంగా రామకృష్ణ సెల్ఫీ వీడియో ఉన్నా ఆయనను తప్పుపట్టకుండా ప్రతిపక్షాలపై వనమా వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు ఏమాత్రం పశ్చాత్తాపం ఉన్నా కుమారుడు చేసిన దారుణానికి నైతిక వహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటన జరిగిన వెంటనే వనమాను రాజీనామా చేయాలంటూ కోరాల్సిందనీ, రాఘవేంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందన్నారు. రాఘవేంద్రపై రౌడీషీట్ తెరవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు పాల్గొన్నారు.
వనమా రాఘవ మాఫియా చర్యలకు
ప్రభుత్వానిదే బాధ్యత : న్యూడెమోక్రసీ
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దృతరాష్ట్ర వ్యవహారంతోనే ఆయన కుమారుడు రాఘవ కీచకుడిగా, మాఫియాగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ విమర్శించింది. రామకృష్ణకు నలుగురు కుటుంబ సభ్యులు సజీవదహనం ముమ్మాటికీ రాఘవ చేసిన హత్యలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.
ఈ మాఫియా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మొత్తం వారి ఎమ్మెల్యేల రౌడీ చర్యలకు బాధ్యత వహించి వాటిని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ కోరారు. ఆయన కుమారుడు చర్యలకు బాధ్యత వహిస్తూ వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.