Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండేకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 1998 సంవత్సరం నుంచి మూతపడి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ ఫ్యాక్టరీని వెంటనే పున:ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్పాండేకు గురువారం ఆయన లేఖ రాశారు. సీసీఐ ఏడాదికి నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 1984, ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైందని గుర్తు చేశారు. 14 ఏండ్లు మాత్రమే నడిచి 1998, నవంబర్ ఐదున ఉత్పత్తి నిలిపివేసిందని వివరించారు. అంచనా వేసిన ముడిసరుకు 48.18 మిలియన్ టన్నుల్లో కేవలం ఆరు మిలియన్ టన్నులు మాత్రమే వినియోగించిందని తెలిపారు. ఇంకా 42.66 మిలియన్ టన్నులు అందుబాటులో ఉన్నదంటూ 2016లో ప్రభుత్వమే ప్రకటించిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ, మైనింగ్ అవసరాల కోసం 2289.85 ఎకరాలను కంపెనీ సేకరించిందని వివరించారు. వాస్తవంగా ఆదిలాబాద్, జైనత్, బేల మండలాల్లో పుష్కలంగా లైమ్‌స్టోన్ నిల్వలున్నాయని తెలిపారు. నిర్మాణరంగం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సిమెంటుకు భారీగా డిమాండు పెరుగుతున్నదని పేర్కొన్నారు. సరుకు రవాణాకూ మూడు కిలోమీటర్ల పరిధిలోనే బ్రాడ్‌గేజ్ రైల్వే, నేషనల్ హైవే రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రారంభిస్తే రాష్ట్ర అవసరాలతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సులభంగా ఇక్కడినుంచి సిమెంట్ రవాణా చేయొచ్చని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే పారిశ్రామికంగా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉందని తమ్మినేని ఈ సందర్భంగా తెలిపారు. సీసీఐ సిమెంటు ఫ్యాక్టరీని తెరిపించాలనే ఆకాంక్ష స్థానిక ప్రజల్లో బలంగా ఉన్నదని పేర్కొన్నారు. తమను గెలిపిస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అక్కడి ఎంపీ స్థానంలో గెలిచిన బీజేపీ ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. సిమెంటు ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తే అన్ని రకాలుగా సహకరిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేంద్ర మంత్రికి లేఖ రాసినట్టు తెలిసిందని తెలిపారు. అందువల్ల వెంటనే స్పందించి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కంపెనీ పున:ప్రారంభిస్తే ఇక్కడి ఆదివాసీ, ఇతర వెనుకబడిన తరగతుల యువతకు ఉపాధి లభించడంతోపాటు ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు.