Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ మహిళా విభాగం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడికి వెళ్తున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) మహిళా విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ మహిళా విభాగం చైర్పర్సన్ ఎం సంయుక్త, టీఎస్‌యూటీఎఫ్ మహిళా విభాగం కన్వీనర్ సిహెచ్ దుర్గాభవాని, కార్యదర్శులు శాంతికుమారి, శారద, నాగమణి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వనపర్తి జిల్లాలోని మల్లయ్యపల్లిలో కాలినడకన పాఠశాలకు వెళ్తున్న బాలికను ఇద్దరు దుండగులు బైకుపై దించుతామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారని తెలిపారు. బేటీ బచావో, బేటీ పడావో అని చెప్తున్న ప్రభుత్వాలు ఆడపిల్లలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని విమర్శించారు. బేటీ బచావో, బేటీ పడావో అని చెప్తున్న ప్రభుత్వాలు నినాదాలకే పరిమితమవ్వకుండా ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వారు బడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. ఆయా సౌకర్యాలు లేని గ్రామాల్లో సురక్షితమైన హాస్టల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పిల్లలు చదువుకోవడానికి సౌకర్యంగా ఉన్న ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రజారవాణా వ్యవస్థను కుదిస్తున్నదని తెలిపారు. బస్సుల సంఖ్యను తగ్గించడం వల్ల ఆడపిల్లల చదువులపై తీవ్ర ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ఆడపిల్లలకు సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు.