Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్టయినట్టు వార్తలు
- అలాంటిదేమీ లేదన్న పాల్వంచ ఏఎస్పీ
- 4 రోజుల తర్వాత వెలుగులోకి మృతుడి సెల్ఫీ వీడియో
- పోలీసులే వ్యూహాత్మకంగా బయటపెట్టారని అనుమానం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్-2గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు (రాఘవ)ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేసినట్టు ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు, పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ అసలు రాఘవ తము దొరకలేదనీ, అరెస్టే చేయలేదని గురువారం రాత్రి పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించడంతో గందరగోళం నెలకొంది.రాఘవను అరెస్టు చేయడంలో పోలీసులు అలక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తాయి. మరోవైపు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. ఘటన జరిగి మూడు రోజులవుతున్నా ఏ-2 నిందితుడిని అరెస్టు చేయకపోవడం వెనుక 'అధికార' బలమే ప్రధాన కారణంగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు, పోస్టులు వెల్లువెత్తాయి. పరారీలో ఉన్న రాఘవ లోకేషన్ ట్రేసవుట్ చేస్తున్నామనీ, ఏడెనిమిది స్పెషల్ టీంలతో తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నట్టు ఏఎస్పీ ప్రకటించారు. మరోవైపు రాఘవ మాత్రం ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని చాటుకునేందుకు ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశాడు. రాఘవ ఫోన్ ఆన్‌లోనే ఉన్నా.. మీడియాకు వీడియోలు, పోస్టులు రిలీజ్ చేస్తున్నా పోలీసులు ట్రేసవుట్ చేయడంలో జాప్యం చేయడం ఉద్దేశపూర్వకమేనన్న మాటలు వినిపించాయి. రాఘవ తండ్రి అధికారపార్టీ ఎమ్మెల్యే కాబట్టే అరెస్టు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కించారని వార్తలు వస్తున్నాయి.
ఆ వీడియోతోనే అరెస్టుకు సన్నద్ధం...
రామకృష్ణ ఆత్మహత్య లేఖలో తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లతో పాటు రాఘవ పేరు కూడా ఉన్న విషయం విదితమే. తాజాగా రామకృష్ణ చనిపోవడానికి ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియా, మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిలో ఈ ఆస్తి గొడవను ఓ కొలిక్కి తెచ్చేందుకు భార్య శ్రీలక్ష్మిని తీసుకొని తనను హైదరాబాద్ రమ్మని రాఘవ ఆదేశించాడని స్పష్టంగా తెలిపాడు. అంతేకాక రాఘవ చేసిన అనేక అకృత్యాలు, అరచకాలను సైతం ఈ వీడియోలో ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో కుమారున్ని రక్షించుకునేందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విశ్వప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలం కావడంతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. ''పాల్వంచ ఘటన తీవ్ర క్షోభకు గురిచేసిందనీ, తన కుమారుడిపై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు. రాఘవను పోలీసు విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు రాఘవను రాజకీయాల్లోకి అనుమతించనని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ వెలువడిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రాఘవను పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి.