Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సంస్థలకు టీఎస్ఈఆర్సీ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థలు చట్ట ప్రకారం నిర్ణీత గడువులోపు పిటీషన్లను దాఖలు చేయకుంటే జరిమానాలు తప్పవని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) హెచ్చరించింది. ఆ మేరకు 2016 తెలంగాణ ముఖ్య నియంత్రణ గెజిట్‌కు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా నియంత్రణ ఉత్తర్వులు జారీ చేసింది. 2016నాటి గెజిట్‌లో ఏఏ పిటీషన్లను ఎప్పటిలోపు కమిషన్‌కు సమర్పించాలనే అంశాలను మాత్రమే ప్రస్తావించారనీ, ఆ గడువులోపు ఇవ్వకుంటే ఏం చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వలేదని టీఎస్ఈఆర్సీ అధికారులు తెలిపారు. తాజాగా కమిషన్ ఆ గెజిట్‌లో జరిమానా సవరణలను ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిప్రకారం విద్యుత్ సంస్థలు (డిస్కంలు, ఉత్పత్తి సంస్థలు, ట్రాన్స్‌కో, స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ వగైరా) ఏటా సమర్పించాల్సిన ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్ఆర్), టారిఫ్, మల్టీ ఇయర్ టారిఫ్ పిటీషన్లు, వార్షిక నైపుణ్య సమీక్షా పిటీషన్లు, మధ్యంతర పిటీషన్లు, ట్రూ అప్ పిటీషన్లు, అడిషనల్ సర్‌చార్జి పిటీషన్లు, రిసోర్స్ పిటీషన్లు, రాష్ట్ర విద్యుత్ ప్లాన్ పిటీషన్, బిజిసెన్ ప్లాన్ పిటీషన్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ప్లాన్ పిటీషన్లను నిర్ణయించిన కాలపరిమితిలో టీఎస్ఈఆర్సీకి సమర్పించాలి. లేనిపక్షంలో గడువు తేదీ దాటిన మొదటి 30 రోజులకూ రోజుకూ రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తారు. 30 రోజులు దాటినా పిటీషన్లు దాఖలు చేయకుంటే రూ.1.50 లక్షలతో పాటు రోజుకు రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తారు. ఇది ఆయా పిటీషన్లు దాఖలు చేసే వరకు వర్తిస్తుంది. ఈ మేరకు గెజిట్ సవరణకు టీఎస్ఈఆర్సీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ తరహా నిబంధనలు ఉత్తరప్రదేశ్‌తో పాటు కొన్ని రాష్ట్రాల ఈఆర్సీలు అమలు చేస్తున్నట్టు టీఎస్ఈఆర్సీ వర్గాలు తెలిపాయి.