Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా మహాసభలో జూలకంటి రంగారెడ్డి
- జిల్లా కార్యదర్శిగా తిరుపతి నాయక్ ఎన్నిక
నవతెలంగాణ - జగిత్యాల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అందరూ ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా రెండో మహాసభ గురువారం పట్టణంలో సీనియర్ నాయకుడు భూతం సారంగపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ఏడేండ్లు గడిచినా ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. అలాగే, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల మరణాలకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి కోట్లాది మంది ఉద్యోగులను రోడ్డుపాలు చేసిందని అన్నారు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు ప్రతిరోజూ పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలు, రైతులకు అందుతున్న సబ్సిడీని కత్తిరించి భారాలు వేసేందుకు సిద్ధపడిందన్నారు. అలాగే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. జోనల్ మల్టీ జోనల్ పేరుతో తీసుకొచ్చిన 317 జీవోను సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేసేందుకు సిద్ధపడిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా నూతన కార్యదర్శిగా గుగులోత్ తిరుపతి నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరాంనాయక్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్.శారద, ఇందూరి సులోచన, ఎంఏ.చౌదరి, ఎమ్డీ.అక్రమాలిక్, ఎం.రాజలింగు తదితరులు పాల్గొన్నారు.