Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు ఉపాధ్యాయుల డిమాండ్
- విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన
- ఎస్టీయూ, టీపీటీఎఫ్, టీపీయూఎస్, టీఎస్‌టీటీఎఫ్ నేతల మద్దతు
- ప్రభుత్వానికి పంపిస్తా: అదనపు సంచాలకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మాకు న్యాయం చేయండి. మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మా సమస్యలను పరిష్కరించాలి, భార్యాభర్తలకు న్యాయం చేయాలి'అంటూ పలువురు ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. డీఈవో, కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'మా గోడును ఎక్కడ చెప్పుకోవాలి. మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు.'అంటూ ప్రశ్నించారు. డీఈవో కార్యాలయానికి వెళ్తే పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి వెళ్లమంటారు, ఇక్కడికి వస్తే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లమంటారు, తమ సమస్యలకు పరిష్కారం ఎలా?అని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చే ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం నుంచే పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి ఉపాధ్యాయుల తాకిడి మొదలైంది. అంతకుముందు ఇచ్చిన విజ్ఞప్తులు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన అందుబాటులో లేరు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్య, జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్ చాంబర్ వద్ద బైటాయించి నిరసన చేపట్టారు. ఎస్టీయూటీఎస్, టీపీటీఎఫ్, టీపీయూఎస్, టీఎస్‌టీటీఎఫ్ నేతలు జి సదానందంగౌడ్, మైస శ్రీనివాసులు, హన్మంతరావు, నవాత్ సురేష్, లక్ష్మణ్‌నాయక్ మద్దతుగా నిలిచారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లోనూ భార్యాభర్తలను అనుమతించాలనీ, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగసంస్థలు, కార్పొరేషన్ ఉద్యోగులనూ స్పౌజ్‌గా పరిగణించాలని కోరారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు వచ్చి ఉపాధ్యాయులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అధికారులను సంప్రదించారు. అనంతరం ఉపాధ్యాయుల వద్దకు లింగయ్య వచ్చి అప్పీళ్లను స్వీకరిస్తామనీ, వాటిని ప్రభుత్వానికి పంపించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులు మళ్లీ అప్పీళ్లు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
టీచర్లకు న్యాయం చేయాలి : టీపీటీఎఫ్
జిల్లాల కేటాయింపుల్లో వివిధ కారణాలతో నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లోనూ స్పౌజ్ బదిలీలను చేపట్టాలని కోరారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉపాధ్యాయులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.