Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ
నవతెలంగాణ- విద్యానగర్
ప్రసవం కోసం రిమ్స్‌కు వచ్చిన ఆదివాసీ మహిళ వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో బంధువులు, ఆదివాసీ సంఘాల నాయకులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుట ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ నటరాజ్ అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులు, ఆదివాసీ నాయకులతో చర్చలు జరిపారు. రూ.50వేల పరిహారం, మృతురాలి భర్తకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో పాటు సంబంధిత వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో వారు శాంతించి నిరసన విరమించారు. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన కుమ్ర గంగుబాయి డిసెంబర్ 22న ప్రసవం కోసం రిమ్స్‌కు వచ్చింది. పరీక్షించిన వైద్యులు సీజేరియన్ చేయడంతో అదే నెల 24వ తేదీన పాపకు జన్మనిచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో వైద్యులు అదే నెల 29న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతి చెందింది. మహిళ మృతికి రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు, ఆదివాసీ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ రాఠోడ్ నరేందర్, మావల తహసీల్దార్ వనజారెడ్డి ఆందోళనకారులను సముదాయించినా వారు వినిపించుకోలేదు. చివరకు జిల్లా అదనపు కలెక్టర్ నటరాజ్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్ మద్దతు తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.10వేల సాయం అందించారు.